ఏపీతో పోటీకి రెడీ అవ్వండి: తమిళనాడు మంత్రి కీర్తనకు లోకేష్ టాస్క్!
తమిళనాడులో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారిస్తోంది. ఇండస్ట్రీస్ శాఖ మంత్రి కీర్తన తన రాష్ట్రానికి ఇన్వెస్ట్‌మెంట్స్ ఆహ్వానిస్తూ ఒక ఆకర్షణీయమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తమిళనాడు భవిష్యత్తును తామే నిర్మిస్తామని, సింగిల్ విండో క్లియరెన్స్, వేగవంతమైన అనుమతులు, ఏఐ నగరాలు, గ్రీన్ హైడ్రోజన్, అధునాతన తయారీ, అంతరిక్ష ఆర్థికవ్యవస్థ వంటి ఆవిష్కరణలతో ఒక అద్భుతమైన పర్యావరణాన్ని సృష్టిస్తున్నామని వివరించారు.
తమిళనాడు మంత్రి వీడియో కు రెస్పాండ్ అయిన మంత్రి లోకేష్
ఈ పోస్ట్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కీర్తనను ట్యాగ్ చేస్తూ లోకేష్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.కీర్తన గారూ, పెట్టుబడులను ఆకర్షించడంలో మీ ఫోకస్ ను అభినందిస్తున్నాను. ప్రతి ఇండస్ట్రీస్ మంత్రి తన రాష్ట్రాన్ని సక్రమంగా మార్కెటింగ్ చేయాలి. పెట్టుబడిదారులతో నేరుగా సంప్రదింపులు చేసి, ఉద్యోగాలు కల్పించే వారిలో నమ్మకం పెంచాలి అని అన్నారు. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు గట్టి పోటీ ఇస్తుందని స్పష్టం చేశారు.

రెండు రాష్ట్రాల మధ్య పోటీ ఉంటుందన్న లోకేష్
ఈ పోటీ ఆరోగ్యకరమైనది అని, ఇది రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు. లోకేష్ ట్రోల్స్ ఉద్యోగాలు సృష్టించవు, పెట్టుబడులు మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి అని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలు పారిశ్రామికాభివృద్ధికి చొరవ చూపడాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా ప్రస్తావించారు. ఈ స్పందనలో లోకేష్ తమిళనాడు మంత్రికి సవాలును కూడా విసిరారు.
లోకేష్ ట్వీట్ కు మంత్రి కీర్తన ప్రతిస్పందన
రెండు పొరుగు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ దేశ అభివృద్ధికి దోహదపడుతుందన్న సందేశం ఇచ్చారు. కీర్తన లోకేష్ స్పందనకు ధన్యవాదాలు తెలిపారు.థ్యాంక్యూ లోకేష్ గారు. తమిళనాడు ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవకాశాలు కల్పించడానికి చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తాను అని రిప్లై ఇచ్చారు. వీరిరువురి సంభాషణ రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక పోటీని ప్రతిబింబిస్తోంది.
గతంలో టీడీపీతో అనుబంధం కలిగి ఉన్న తమిళనాడు మంత్రి కీర్తన
కీర్తన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, ఆమె శివకాశి నియోజకవర్గం నుంచి గెలిచిన యువ మంత్రి. చాలా చిన్న వయసులోనే మంత్రి పదవి అందుకోవడం ఆమె సామర్థ్యానికి నిదర్శనం. ఆమె తెలుగు రాజకీయాలతో కూడా మంచి అనుబంధం కలిగి ఉంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం కీర్తన కృషి చేశారు. ఎమ్మెస్సీ చదివిన ఆమె కార్పొరేట్ ఉద్యోగాలకు బదులు ప్రజా సేవను ఎంచుకున్నారు. టీవీకే పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఆమె తండ్రి కూడా రాజకీయ నేత.













Click it and Unblock the Notifications