టీడీపీలో ఆ సీనియర్లకు షాక్ - లోకేష్ వ్యాఖ్యలతో : కొత్త వ్యూహాలు - సంస్కరణలు..!!
టీడీపీ మహానాడు వేళ..ఆ పార్టీ సీనియర్లలో కలకలం మొదలైంది. పార్టీ ముఖ్యనేత..చంద్రబాబు తనయుడు లోకేష్ పార్టీలో తీసుకొచ్చే మార్పుల పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీలో వరుసగా మూడు సార్లు ఓడిన నేతలకు సీటు కేటాయించకూడదనే ప్రతిపాదన మరోసారి తెర మీదకు తెచ్చారు. గతంలోనే పార్టీలో ఇటువంటి చర్చ సాగింది. అయితే, సీనియర్లు ఎక్కువగా ఉండటంతో దీనిని అమల్లోకి తీసుకురాలేదు. అయితే, ఇప్పుడు మహానాడు వేదికగా యువతకు 40 శాతం టిక్కెట్లు ఇవ్వనున్నట్లు చంద్రబాబు తేల్చి చెప్పారు.

మూడు సార్లు ఓడిన సీనియర్లలో
దీనికి కొనసాగింపుగా మూడు సార్లు ఓడిన వారికి సీట్లు లేవంటూ లోకేష్ పరోక్షంగా స్పష్టం చేసారు. దీంతో..పార్టీలో పలువురు సీనియర్లు ఖంగుతిన్నారు. అయితే, వారి సేవలను మాత్ర పార్టీ వినియోగించుకుంటుందని చెబుతున్నారు. సీట్ల కేటాయింపుతో పాటుగా పదవుల విషయంలో నూ చేసిన తాజా ప్రతిపాదనలు సీనియర్లకు ప్రాధాన్యత పైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
పార్టీలో పలు పదవుల్లో కొంత మంది సీనియర్లు దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడు దఫాలుగా కొనసాగుతున్న తనను తప్పించి..మరొకరికి అవకాశం ఇవ్వాలని లోకేష్ స్వయంగా ప్రతిపాదించటం సీనియర్లకు మింగుడు పడని అంశం. దీని ద్వారా సీనియర్ల స్థానంలో యువతకు అవకాశం ఇవ్వాలనేది లోకేష్ ప్రతిపాదన.

ఆ 30 స్థానాల పైన చర్చ మొదలు
దీని పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో గెలుపు పైన టీడీపీలో ధీమా అప్పుడే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఏ రకంగా ఈ సారి వ్యవహరించాలనే దాని పైన నేతలు అప్పుడే తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అదే సమయంలో ఇప్పుడు పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వటం ..సీనియర్లకు అటు సీట్ల కేటాయింపు - ఇటు పార్టీలో పదవుల వ్యవహారంలో తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
సీనియర్లను కేవలం పార్టీకి దిశా నిర్దేశం చేసే వరకే పరిమితం చేసి.. క్షేత్ర స్థాయిలో యువతకు ప్రాధాన్యత ఇచ్చి..పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ చేయాలనే ఉద్దేశం తాజా వ్యూహాల్లో కనిపపిస్తోంది. అదే సమయంలో లోకేష్ దాదాపు 30 స్థానాల్లో అభ్యర్ధుల గురించి ప్రస్తావన చేసారు.

పార్టీ పదవుల్లోనూ సంస్కరణలు
పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ లు గా ఉన్న వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ 30 నియోజకవర్గాల్లో బాధ్యులను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో.. ఇప్పుడు ఆ 30 నియోజకవర్గాలు ఏంటనే చర్చ మహానాడు వేదికగా పార్టీ నేతల మధ్య చర్చకు కారణమవుతోంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు ప్రతీ సీటు కీలకంగా మారనుంది.
అదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ వస్తూనే అభ్యర్ధులను ప్రకటిస్తామని లోకేష్ చెప్పటం ద్వారా..ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక పైన ఒక అంచనాకు వచ్చారనే సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. పొత్తుల విషయంలో ఎన్నికల సమయంలో నిర్ణయాలు ఉంటాయని..ఏది ప్రయోజనకరమని భావిస్తే ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేసారు.

చంద్రబాబు నిర్ణయాలపై ఉత్కంఠ
ఇక, మహానాడు వేదిక ద్వారా పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యకర్తలుగా నమోదు చేసుకున్న వారికి కష్ట సమయంలో పార్టీ నుంచే అందే సహకారం పైన ప్రత్యేంగా ప్రస్తావించారు. మొత్తం 60 లక్షల మంది కార్యకర్తలుగా నమోదు చేసుకొని ఉండటంతో..వారంతా వచ్చే ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో కీలకంగా పని చేసే విధంగా.. వారికి అండగా నిలుస్తూ..వారిలో ఉత్సాహం నింపేలా కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. దీంతో... తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన చర్చకు..చంద్రబాబు నిర్ణయాలతో సమాధానం వచ్చే అవకాశం కనిపిస్తోంది.