పాపం లోకేష్.. స్టూల్ పై మైక్ లేకుండానే ప్రసంగం; మళ్ళీ అదే సీన్ రిపీట్!!
నేడు నెల్లూరు గంగాధర నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుపడ్డారు. లోకేష్ ను మాట్లాడనివ్వకుండా మైక్ లాక్కుని పోలీసులు అడ్డంకులు కలిగించారు. నేడు కూడా నిన్నటి సీన్ రిపీట్ అయ్యింది.
యువ గళం పాదయాత్ర ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. ఆదిలోనే హంస పాదు అన్నట్టు పాదయాత్ర ప్రారంభం నాడే నందమూరి తారకరత్న కుప్పకూలిపోయి ఆసుపత్రి పాలు కాగా.. అప్పుడు మొదలైన అరిష్టాలు, పడుతున్న కష్టాలు నారా లోకేష్ ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి.

లోకేష్ పాదయాత్రలో నేడు కూడా నిన్నటి సీన్ రిపీట్
ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర అడుగడుగునా గండాలతో, ఇబ్బందుల నడుమ 16వ రోజు కొనసాగుతుంది. నేడు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆయన పాదయాత్రలో భాగంగా లోకేష్ ఈరోజు కూడా పడరాని పాట్లు పడ్డారు. ఈ రోజు ఎస్ఆర్ పురం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఇక ఈరోజు కూడా పాదయాత్రకు పోలీసులు అడ్డుపడ్డారు. లోకేష్ ను మాట్లాడనివ్వకుండా మైక్ లాక్కుని పోలీసులు అడ్డంకులు కలిగించారు. నేడు కూడా నిన్నటి సీన్ రిపీట్ అయ్యింది.

స్టూల్ పై నిలబడి .. మైక్ లేకుండానే లోకేష్ ప్రసంగం
ఎస్ఆర్ పురం పుల్లూరు క్రాస్ రోడ్డులో చేసేదేమీ లేక లోకేష్ స్టూల్ పై నిలబడి మాట్లాడారు. పోలీసులు మైక్ లాక్కోవడంతో, అక్కడికి వచ్చిన జనాలను సైలెంట్ గా ఉండమని విజ్ఞప్తి చేసి లోకేష్ మైక్ లేకుండానే మాట్లాడారు. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ గతంలో ఎప్పుడూ తాము జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను అడ్డుకోలేదని, తానేమీ టెర్రరిస్టును కాదని, అయినా ఎందుకు తన పాదయాత్రను అడ్డుకుంటున్నారో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. తాను దేశాన్ని దోచేసి జైలుకు వెళ్లి రాలేదని లోకేష్ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు.

పోలీసుల తీరుపై లోకేష్ అసహనం
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడానికి ప్రజల కోసం ప్రజల్లోకి వచ్చానని పేర్కొన్న ఆయన.. పోలీసులు తన మైకు లాక్కోవడం పై పెట్టిన శ్రద్ధ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడం పై పెట్టాలన్నారు. తన పాదయాత్రను అడ్డుకోవడానికి వెయ్యి మంది పోలీసులు, ఆరుగురు డిఎస్పీలు వచ్చారని, చివరకు మహిళలకు రక్షణ కల్పించాల్సిన దిశ డి.ఎస్.పి కూడా తన వెంటే తిరుగుతున్నారని నారా లోకేష్ మండిపడ్డారు.

గతంలో ఐఏఎస్ లే ఇప్పుడు ఐపీఎస్ లు కూడా జైలుకు వెళ్ళటం ఖాయం : లోకేష్
ఇక ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని పేర్కొన్న నారా లోకేష్ సమస్యలు, అవినీతి ఫుల్లుగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ప్యాలెస్ పిల్లి పనైపోయిందని జగన్ ను టార్గెట్ చేశారు. తన పాదయాత్రను అడ్డుకుంటున్న పోలీసులపై మండిపడిన లోకేష్ పోలీసు అధికారి రఘురామిరెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐఏఎస్ లు మాత్రమే జైలుకు వెళ్లారని, ఇప్పుడు ఐపీఎస్ లను కూడా జైలుకు తీసుకుపోతారని లోకేష్ వ్యాఖ్యానించారు.

పాపం లోకేష్... ఎందుకొచ్చిన కష్టం ఇదంతా ..
ఇక భయం తన బయోడేటాలో లేదని పేర్కొన్న లోకేష్ తనది ధర్మయుద్ధం అంటూ వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఎంత గట్టిగా ప్రతిఘటిస్తున్నా పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇక పోలీసుల తీరుపై ఈరోజు కూడా అసహనం వ్యక్తం చేస్తూ, మైకు లేకుండానే లోకేష్ ప్రసంగం సాగింది. ఇక లోకేష్ పాదయాత్రలో పడుతున్న కష్టాలను చూసిన వారంతా అయ్యో పాపం లోకేష్.. ఎందుకొచ్చిన కష్టం ఇదంతా అంటున్నారు.












Click it and Unblock the Notifications