ఎలక్షన్ కాదిది ఫ్యాక్షనిస్ట్ కనుసన్నల్లో జరిగే సెలక్షన్; ప్రజాస్వామ్యానికి దొంగ ఓట్ల వేటు: జగన్ టార్గెట్
చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మినీ స్థానిక సమరంలో అందరిచూపు ప్రధానంగా చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం పై కేంద్రీకృతమైంది. కుప్పంలో పట్టు సాధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమ బలాన్ని నిలుపుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేసి, పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎన్నికలకు వెళ్లారు. ఎవరికి వారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు . ఈ క్రమంలో అక్కడ సోమవారం ఉదయం నుండి పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది.
కుప్పం పోలింగ్ పై టీడీపీ ఫైర్ .. దొంగ ఓట్ల రగడ
అయితే అధికార వైఎస్ఆర్సీపీ నేతలు దొంగ ఓటర్లను పట్టణంలోకి తీసుకువచ్చి ఉంచారంటూ టిడిపి నేతలు ఆరోపణలు చేయడం, దొంగ ఓటర్లను పట్టించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పోలింగ్ పై వైసిపి నేతల తీరుపై, వైసీపీ నేతలకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అంటూ ప్రశ్నించారు. దొంగ ఓటర్లను వదిలేస్తూ పట్టించిన వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ దొంగ ఓటర్లకు వాలంటీర్లు సహకరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఓడిపోతామనే భయంతో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

బాబాయ్ కి గొడ్డలిపోటు, ప్రజా స్వామ్యానికి దొంగ ఓట్ల వేటు ..జగన్ పై ధ్వజమెత్తిన లోకేష్
ఇక ఇదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం కుప్పం పోలింగ్ లో వైసిపి అరాచకాలపై మండిపడ్డారు. కుప్పం మున్సిపాలిటీ పోలింగ్ సందర్భంగా ఇతర ప్రాంతాల వారిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ ని గొడ్డలిపోటుతో బలి చేసినట్టే ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో జగన్ రెడ్డి ఖూనీ చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. టిడిపి నేతలను నిర్బంధించి ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేసి వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని లోకేష్ ఆరోపించారు.

ఎన్నికల వ్యవస్థని నడి బజారులో అంగడి సరుకుగా మార్చిన జగన్ రెడ్డి
కుప్పంలో దొంగఓట్లతో, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్ రెడ్డి నడి బజారులో అంగడి సరుకుగా చేశారని తీవ్ర విమర్శలు చేశారు లోకేష్. ఇతర ప్రాంతాల వారికి పోలీసులు ఎలా కుప్పంలో అనుమతి ఇచ్చారని ప్రశ్నించిన లోకేష్, ఓటమి తప్పదని తెలిసే సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డదారులు తొక్కుతున్నారని పేర్కొన్నారు. వైసిపి వాలంటీర్ లే దొంగ ఓటర్లను పోలింగ్ బూతుల కు తీసుకొస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటూ ఎన్నికల సంఘాన్ని నిలదీశారు లోకేష్. ఇక పోలీసుల ముందే దొంగ ఓటర్లు కాలరెగరేసి మరీ ఓటు వేసి వెళుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Recommended Video

ఓటమి పాలవుతామని గ్రహించే అడ్డ దారులు తొక్కుతున్న జగన్
ఇతర ప్రాంతాల నుండి దొంగ ఓట్లు వేయడానికి వారికి కుప్పంలో ఎలా అనుమతించారంటూ నిలదీశారు. కుప్పంతో పాటు పలు ప్రాంతాలలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారి వీడియోలను నారా లోకేష్ విడుదల చేశారు. ఇంతా జరుగుతుంటే ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచక పాలన, పెరిగిన ధరలు, వైసిపి హయాంలో విపరీతంగా పెంచిన పన్నులు, రాష్ట్రంలో అధ్వానంగా మారిన రోడ్లు, రాష్ట్రంలో ఎక్కడా కనపడని అభివృద్ధి వెరసి ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఓట్లు వేస్తే ఓటమి పాలు అవుతామని గ్రహించి జగన్ రెడ్డి అడ్డదారులు తొక్కుతున్నారు అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎలక్షన్ ను ఫ్యాక్షనిస్టు కనుసన్నల్లో జరిగే సెలక్షన్ గా మార్చేశారని లోకేష్ ధ్వజమెత్తారు.