టీడీపీలో నెంబర్ టూ ఎవరు - బాలయ్య వర్సస్ లోకేశ్, ఎవరు ఎవరితో..!!
టీడీపీ పరీక్షా సమయం ఎదుర్కోంటోంది. చంద్రబాబును అరెస్ట్ చేసినా పార్టీ నేతల్లో సరైన వ్యూహం కనిపించటం లేదు. చంద్రబాబు అందుబాటులో లేకపోతే పార్టీని నడిపించే నాయకత్వం కనిపించటం లేదు. చంద్రబాబు తాను అందుబాటులో లేకపోయినా పార్టీని ముందుకు నడిపించే నాయకత్వాన్ని సిద్దం చేయలేదా. నాయకులు ముందుకు రావటం లేదా. ఈ సమయంలో పార్టీలో నెంబర్ టు ఎవరు. బాలయ్యా.. లేక లోకేశా వీరిద్దరి మధ్య ఎవరు. పార్టీలో ఎవరు ఎవరివైపు...
లోపించిన నాయకత్వం :టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉన్నారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, అన్నింటా చంద్రబాబు ముందుండి పార్టీని నడిపించారు. ఎప్పుడు ఎలాంటి అడుగులు వేయాలో..ఎలా వ్యవహరించాలో తన అనుభవంతో ముందుకు కదిలారు. ఫలితం ఎలా ఉన్నా..చంద్రబాబు నిర్ణయం అంతిమం. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలి సారి అయిదు రోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు.

జైలులో కుటుంబ సభ్యులు..న్యాయవాదులు కలుస్తున్నా.. పార్టీ వ్యవహారాల పైన మాత్రం నిర్ణయాలు బయటే జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ నేతలు ఎలా స్పందించాలనే దాని నుంచి ఇప్పటి వరకు ప్రణాళికా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్లు సైతం అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.
ఎవరికి వారే అన్నట్లుగా : ఇప్పటి వరకు చంద్రబాబు తరువాత లోకేశ్ పార్టీలో నెంబర్ టూ గా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో లోకేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రిలో మకాం వేసారు. అక్కడే పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసారు. న్యాయ నిపుణులతో టచ్ లో ఉంటున్నారు. ఇదే సమయంలో ఇటు తొలి సారి అమరావతి పార్టీ కార్యాలయంలో నందమూరి బాలయ్య ప్రత్యక్షమయ్యారు. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం అయ్యారు.
చంద్రబాబు అరెస్ట్‌తో మరణించిన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు. పార్టీ కోసం నందమూరి కుటుంబం ఉందని చెప్పుకొచ్చారు. ఏనాడు పార్టీ కార్యాలయానికి రాని బాలయ్య ఇప్పుడు నేతలతో సమీక్ష చేసినా కీలక నిర్ణయాలు మాత్రం తీసుకోలేదు. చంద్రబాబు స్థానంలో కూర్చొని పార్టీ నేతలతో చర్చలు మాత్రమే చేసారు.

బాలయ్య సొంత ప్రకటనలనపైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో తారక్ ప్రస్తావన నేతల మధ్య చర్చల్లోకి వస్తోంది. తారక్ పార్టీకి అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు ప్రత్యక్ష పర్యవేక్షణ కొద్ది రోజులే దూరం అయినా..అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయనే అభిప్రాయం కేడర్ లో కనిపిస్తోంది. దీంతో, తిరిగి చంద్రబాబు పార్టీ అధినేతగా తన పని ప్రారంభిస్తేనే ఈ డైలమాకు ముగింపు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications