బీ అలర్ట్: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: ఉత్తరాంధ్రపై ప్రభావం: తెలంగాణపైనా
అమరావతి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ నెల 13వ తేదీ నాటికి ఈ అల్పపీడనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం నెలకొని ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. ఇదివరకు నెలకొన్న అల్పపీడనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. 13వ తేదీ నాటికి ఏర్పడబోయే అల్పపీడనం వల్ల మరోసారి అలాంటి పరిస్థితులే ఏర్పడవచ్చని తెలుస్తోంది.
బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు, నిపుణులు అంచనా వేస్తోన్నారు. ఇది క్రమంగా ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తుందని, ఒడిశా తీరం వైపు కదులుతుందని చెబుతున్నారు. దీని ప్రభావం ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉంటుందని అంచనా వేస్తోన్నారు. ఈ అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్రపైనా పడుతుందని అంటున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ తాజా అల్పపీడనం వల్ల వచ్చే ఏడు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తోన్నారు. ఒకట్రెండు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కావడానికి అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావం ఒడిశాపై అధికంగా ఉంటుందని, తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. ఒడిశాలో వరదలు సంభవించే ప్రమాదం కూడా ఉందనే అంచనాలు ఉన్నాయి.

ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి 14 లేదా 15వ తేదీల్లో విశాఖపట్నంలో 100 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం నిపుణులు అంచనా వేస్తోన్నారు.
ప్రస్తుతం బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం బలహీన పడటం వల్ల తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుశాయి. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు ఉంటుందని తెలుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications