కొనసాగుతున్న ఆవర్తనం, దంచికొడుతున్న వానలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. ఒక వైపు వర్షాలు కురుస్తూనే ఉన్నా.. ఉక్కపోత, వేడితీవ్రత కొనసాగుతోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇక...
తెలంగాణలో వచ్చే మూడు గంటలు భారీ వర్షం కురుస్తుందని తాజా బులెటిన్ లో పేర్కొంది. మరో నాలుగు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది. ఏపీలో ఉత్తర కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడలో భారీ వర్షాలు కురుస్తాయ ని.. నేటి నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే, కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

మరోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్షసూచన చేసింది. రాగల రెండు మూడు గంటలలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.
ఈ రోజు ఏపీలో అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో మోస్తరు-భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
అలాగే హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని పలుచోట్ల బుధవారం పడిన పిడుగుపాట్లకు ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఇందులో నలుగురు రైతులు, ముగ్గురు వ్యవసాయ కూలీలు, మరో వ్యక్తి ఉన్నారు. కాగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలు నిర్మల్, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.












Click it and Unblock the Notifications