మాచర్ల మంటలు: టీడీపీనేతల హౌస్ అరెస్టులు; పల్నాడు, గుంటూరు జిల్లాల్లో హైటెన్షన్!!
మాచర్లలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి నిర్వహించిన కార్యక్రమం ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ కార్యక్రమంలో టిడిపి వైఎస్ఆర్ సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ ఒకరి పై ఒకరు దాడులు చేసుకునే దాకా వెళ్ళింది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన గొడవ రాత్రికి చిలికి చిలికి గాలి వానగా మారి, రాళ్ళు, కర్రలతో ప్రతీకార దాడులకు చేసే దాకా వెళ్ళింది.
తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి తగులబెట్టిన విధ్వంసకాండ కొనసాగింది. ఈ ఘటనలో పలువురు టిడిపి నాయకులకు గాయాలయ్యాయి. పావని అపార్ట్మెంట్ లోకి దూసుకెళ్లిన టిడిపి నేతలు పలువురు ఇళ్లను ధ్వంసం చేశారు. ఎనిమిది కార్లు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో నేడు పల్నాడు, గుంటూరు జిల్లాలలో హై టెన్షన్ నెలకొంది.

మాచర్ల ఘటనతో టెన్షన్.. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు
మాచర్ల ఘటనతో టిడిపి నేతలు తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసిపి నాయకుల దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేడు నరసరావుపేట లో ఎస్ పి ని కలిసి ఫిర్యాదు చేయాలని అనంతరం మాచర్ల కు వెళ్లాలని, దాడులకు నిరసనగా టిడిపి శ్రేణులు ఛలో మాచర్ల ఆందోళన కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించిన క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ టిడిపి నేతలను అడ్డుకుంటున్నారు.

ఛలో మాచర్లకు పిలుపునిచ్చిన క్రమంలో నేతల గృహ నిర్బంధాలు
మాచర్ల ఘటనతో టిడిపి నేతల ఇళ్ళ దగ్గర పహారా కాస్తున్న పోలీసులు గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు ఇళ్ల వద్ద మోహరించి వారిని హౌస్ అరెస్ట్ చేశారు. కీలక నేతలు కదలికలపై ప్రత్యేకమైన దృష్టిసారించిన పోలీసులు ఎక్కడికక్కడ టిడిపి నేతలను అడ్డుకుంటున్నారు. ఇక సత్తెనపల్లిలో టిడిపి నేత కోడెల శివరాం ను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చలో మాచర్ల కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కోడెల శివరాం ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో మాచర్లకు టిడిపి కార్యకర్తలు సిద్ధమైన నేపథ్యంలో కోడెల కార్యాలయం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మండిపడుతున్న టీడీపీ నాయకులు.. మాచర్ల వెళ్లి తీరుతామని ఆగ్రహం
అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్పీ ఆఫీసుకు వెళ్లి తీరుతామని టిడిపి నేతలు స్పష్టం చేస్తున్నారు. దాడి చేసిన వైసీపీ నాయకులు వదిలిపెట్టి, టీడీపీ నాయకుల పై కేసులు పెట్టి అరెస్టు చేయడం ఏమిటని టిడిపి నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం చేస్తున్నా, పోలీసులు చూస్తూ ఊరుకున్నారు అని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రాణాలకు ప్రమాదం ఉందని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ దాడులకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. కాగా గుంటూరు రేంజ్ డీఐజీ ని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కూడా టిడిపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

మాచర్లలో 144 సెక్షన్.. బస్సుల నిలిపివేత
ఇప్పటికే 144 సెక్షన్ విధించిన పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా బందోబస్తును పెంచారు. ఇక మాచర్లకు వెళ్ళే బస్సులను సైతం నిలిపివేసి పోలీసులు మాచర్లలో పహారా కాస్తున్నారు. మాచర్లలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ మకాం వేసి మరి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోమారు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications