బాలకృష్ణ, నారా లోకేష్ ఇద్దరూ జోకర్లే: బాలయ్య వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్!!
వైఎస్ఆర్సిపిపై టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెబుతూనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలకృష్ణ. కులాల ఉచ్చులో పడద్దని ప్రజలకు సూచించిన ఆయన జగన్ ది ప్రేమ కాదన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పైన కూడా బాలకృష్ణ, నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. వైసిపి ఓడిపోతుందని జగన్ కు కూడా తెలుసని, అందుకే ఎమ్మెల్యేలు టిడిపి వైపు చూస్తున్నారని తాజాగా అనంతపురంలో బాలయ్య వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
నారా లోకేష్, బాలకృష్ణ ఇద్దరు జోకర్ లేనని, టిడిపి నేత అచ్చెన్నాయుడుకు బుర్ర లేదని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన కార్యక్రమం జగనన్నే మా భవిష్యత్తు అని పేర్కొన్న ఆయన, ఎన్నికలకు ఏడాది ముందే ప్రజల మధ్యకు వెళ్లగలిగిన గట్స్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్న ఆయన ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో మిగిలిన పార్టీలు ఉన్నాయని పేర్కొన్న మల్లాది విష్ణు, తాము పని చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నామన్నారు.

ఇక ఇదే సమయంలో వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి వైపు చూస్తున్నారని బాలయ్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన ఎవరో నలుగురు ఎమ్మెల్యేలు గడ్డి తిన్నంత మాత్రాన అందరూ అలా ఉంటారు అనుకోవడం పొరపాటు అని పేర్కొన్నారు. మా గురించి పక్కనపెట్టి ముందు మీ పార్టీ గురించి ఆలోచించుకోవాలని హితవు పలికారు. గన్నవరంలో టిడిపి నేతలు రోడ్డు మీద కొట్టుకున్నారని, ఇక చంద్రబాబు గుడివాడలో పర్యటిస్తే పంచాయతీకి మీ పార్టీ నేతలు రెడీగా ఉన్నారని ముందు మీ సంగతి మీరు చూసుకోవాలని ఆయన హితవు పలికారు.
ఇక బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపారేశారు. ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదు కాబట్టే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. ప్రజలు టిడిపిని నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications