భార్యతో వివాహేతర సంబంధం: వెంటాడి బస్సులోనే నరికి చంపిన పోలీస్
ప్రకాశం: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబందం రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ పోలీసు.. మరో వ్యక్తిని దారుణంగా నరికి చంపేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాలిగ శ్రీనివాసరావు (41) కారంచేడు పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ.. చీరాలలో కాపురం ఉంటున్నాడు. అతని భార్య స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయంలో పని చేస్తోంది. అదే కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న స్టువార్టుపురంకు చెందిన సునీల్(42)తో ఆమెకు సంబంధం ఉందని శ్రీనివాసరావు అనుమానించాడు.
భార్య ప్రవర్తనపై ఆమె తరఫు బంధువులకు శ్రీనివాసరావు ఫిర్యాదుచేశాడు. దీనిపై రెండు నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అప్పటినుంచి ఆమె గుంటూరులోని తన చెల్లెలు వద్ద ఉంటూ.. చీరాలకు వచ్చి పోతోంది. కాగా, సునీల్ అప్పటికే తన కాపురం గుంటూరుకు మార్చడంతో.. సునీల్, శ్రీనివాసరావు భార్య కలిసి చీరాలకు వచ్చి పోతున్నారు. మంగళవారం సాయంత్రం ఎప్పటిలాగే, కార్యాలయం నుంచి చీరాల బస్ స్టేషన్‌కు వారిద్దరు చేరుకొన్నారు.

చీరాల- నారాయణ్‌ఖేడ్ (టీఎస్ 072 4061) బస్సులో ఎక్కారు. వారి కదలికలపై కన్నేసిన శ్రీనివాసరావు, అదే బస్సు ఎక్కాడు. సునీల్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోవెంట తెచ్చిన కత్తితో సునీల్ మెడ, పొట్ట భాగాలపై పొడిచాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అడ్డుకోబోయిన బాధితురాలికి కత్తి గాట్లు పడ్డాయి.
ఆ వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీనివాసరావు చేరిపోయాడు. ‘నా భార్యతో కలిసి సునీల్ కనిపించడంతో నిలదీశాను. అతడే నాపై కత్తితో దాడి చేశాడు. పెనుగులాటలో ఆ కత్తి అతనికీ తగిలింది' అని శ్రీనివాసరావు చెబుతున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సునీల్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు సాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications