ఘోరం: భార్యను చంపి, ముక్కలుగా నరికేసి సూట్‌కేసులో తీసుకెళ్లాడు
నెల్లూరు: జిల్లాలో ఓ వివాహిత అదృశ్యమైన కేసు విషాదాంతంగా ముగిసింది. ఆమె దారుణ హత్యకు గురైనట్లు తేలింది. భార్యపై అనుమానంతో భర్తే హత్య చేసి మృతదేహాన్ని రెండు ముక్కలు చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని సూట్‌కేసుల్లో తీసుకెళ్లి.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బాకరాపేట వద్ద 20 అడుగుల లోయలో పడేశాడు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ధర్మవరానికి చెందిన విశ్రాంత కోఆపరేటివ్ ఉద్యోగి నతానియన్ నాలుగో సంతానం వినీత, చిత్తూరు జిల్లా కలికిరి చెందిన సుధీర్‌కుమార్‌బాబు సుమారు నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. సుధీర్‌కుమార్‌బాబు నెల్లూరు నారాయణలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అక్కడే హౌస్ సర్జన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇంకా సంతానం కలగ లేదు.
కాగా, నెల్లూరు ఆర్టీసీ సమీపంలోని అరవిందనగర్‌లోని విశ్రాంత డీఎస్సీ ఇంట్లో ఏడు నెలల నుంచి కాపురం ఉంటున్నారు. ఈ క్రమంలో వినీతపై సుధీర్‌కు అనుమానం పెరిగింది. ఈ విషయమై ఇద్దరికి మధ్య మనస్పర్థలున్నాయి. అనుమానం పెరిగిపోయి ఆమెను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు సుధీర్.
ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఇద్దరికి మధ్య వివాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సుధీర్ వినీతను కొట్టి గొంతు నులమడంతో చనిపోయింది. ఆ వెంటనే సుధీర్ అతని మామకు ఫోన్ చేసి 'మీ కుమార్తెకు నాకు గొడవ జరిగిందని, దీంతో ఆమెను చంపేశానను' అని చెప్పాడు.
ఆందోళనకు గురైన ఆయన గురువారం ఉదయం కుమార్తె వినీతకు ఫోన్ చేయగా పనిచేయలేదు. దీంతో డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో నాలుగో నగర సీఐ సీతారామయ్య ఇంటి వద్దకు చేరుకుని ఇంటి తలుపును పగలగొట్టి ఇంట్లో పరిశీలించినట్లు తెలిసింది. ఆ తర్వాత వినీత అదృశ్యంపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముక్కలు చేసి సూట్‌కేసులో తీసుకెళ్లాడు
వినీత మృతిచెందడంతో ఏం చేయాలో అర్థంకాని సుధీర్ బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం అర్ధరాత్రి వరకు ఆమె మృతదేహాన్ని కత్తులతో రెండు బాగాలు చేశాడు. ఎక్కడా రక్తపు మరకలు లేకుండా బాత్‌రూంలోకి మృతదేహాన్ని తీసుకెళ్లి రక్తం పూర్తిగా పోయే వరకు ఉంచి శుభ్రం చేశాడు. శుక్రవారం వేకువజామున ఇంటి వద్దకు ఆటోను పిలిచి ఆ సూట్‌కేసులతో ఇంటి నుంచి బయలుదేరాడు.
అనంతరం బస్సులో తిరుపతికి చేరుకున్నాడు. అయితే ఇంట్లో ఎక్కడా హత్య చేసిన ఆనవాళ్లు కనిపించకుండా సుధీర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కనీసం రక్తపు వాసన లేకుండా చేశారు. వివాహిత అదృశ్యంపై కేసునమోదు చేసిన సీఐ సీతారామయ్య దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బాకరాపేట వద్ద పడేసినట్లు తెలుసుకుని శుక్రవారం రాత్రి వెళ్లి పరిశీలించారు.
అప్పటికే మృతదేహం కుళ్లిపోయి పురుగులు పట్టి ఉండటంతో గుర్తించడం కొంత కష్టంగా మారింది. పూర్తిస్థాయిలో విచారించి వినీతగా గుర్తించారు. తిరుపతిలోని ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి నెల్లూరుకు తీసుకొచ్చారు. హత్య చేసిన భర్త సుధీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications