చితక్కొట్టారు: రేప్ చేసి చిన్నారి హత్య, భార్యే పట్టిచ్చింది
అమరావతి: వైయస్సార్ కడప జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారిని ఓ కామాంధుడు అత్యాచారం చేసి ఆపై చంపేశాడు. ఆ తర్వాత ఊరిచివర పాతిపెట్టాడు. నాలుగు రోజులుగా తమ ఆరేళ్ల పాప ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాప తల్లిదండ్రులు, స్ధానికులు ముమ్మరంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఇంతలో బుధవారం అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన భర్త అస్మ అనే చిన్నారని చంపేశాడని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామంలో జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతురాలి తండ్రి నాయబ్‌రసూల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామానికి చెందిన నాయబ్‌రసూల్, మస్తానీలకు ఇద్దరు పిల్లలున్నారు.
వారిలో అస్మ (6) పెద్దది. నాయబ్‌రసూల్ బెల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 6న సాయంత్రం అస్మ ఇంటబయట తోటి పిల్లలతో అట్లాడుకుంటూ హఠాత్తుగా కనిపించకుండాపోయింది. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో అదే రోజు రాత్రి చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు మిస్సింగ్‌గా కేసు నమోదు చేశారు. ఇంతలో బుధవారం కొప్పర్తి గ్రామానికి చెందిన ఓ మహిళ చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన భర్త అస్మను పాపను హత్య చేసి ఊరిచివర ఉన్న వంకలో పూడ్చిపెట్టి, దానిపై ముళ్లకంప వేశాడని పోలీసులకు వివరించింది.
దీంతో రంగంలోకి దిగిన సీఐ వెంకటశివారెడ్డి సిబ్బందితో ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. వంక వద్ద హత్యకు గురయింది అస్మనే చిన్నారి తండ్రి నాయబ్‌రసూల్ గుర్తించాడు. నిందితుడు ఓబయ్యను అరెస్ట్ చేశారు. అనంతరం పాపను పాతిపెట్టిన స్థలానికి తీసుకువచ్చారు.
దీంతో కోపంతో గ్రామస్తులు నిందితుడు ఓబయ్యపై దాడి చేశారు. పోలీసులు అడ్డుకుని నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిన్నారి మృతదేహాన్ని గురువారం తహసీల్దారు సమక్షంలో వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు.












Click it and Unblock the Notifications