కోడి పందాల్లో దారుణం: కోడికత్తితో గాయం.. ఒకరి మృతితో తీవ్ర విషాదం
సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించిన కోడి పందాల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి పందేల సరదా ఓ వృద్ధుడి ప్రాణాలను తీసింది. కోడి కత్త తగిలి సరిపల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో ఈ ఘటన జరిగింది. పండగరోజు వెంకటేశ్వరరావు చనిపోవడంతో వారింట్లో విషాదం నెలకొంది.

కోడిపందాల జోరు
పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు నిర్వహిస్తుంటారు. ఉభయ గోదావరి జిల్లాలో పందాలు జోరుగా సాగుతుంటాయి. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో కూడా పందాలు జరుగుతున్నాయి. పందాలను చూడటానికి సరిపల్లి వెంకటేశ్వరరావు వచ్చారు. అయితే కోడి కాళ్లకు కత్తులు కడుతుండగా అక్కడ ఆయన నిలబడ్డారు.

కత్తి గుచ్చుకొని..
ఇంకేముంది కోళ్లు ఒక్కసారిగా కాళ్లు విదిలించాయి. ఏముంది.. పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు తోడభాగంలో కత్తి గుచ్చుకుంది. పందాల కోసం కత్తులను మెత్తగా నూరి ఉండటంతో.. తోడ భాగంతో పెద్దగాయమే అయ్యింది. రక్తస్రావం ఎక్కువ కావడంతో వెంకటేశ్వరరావు అక్కడే కుప్పకూలి పడిపోయాడు. అక్కడున్న వారు వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. వెంకటేశ్వరరావు చనిపోయారని వైద్యులు పేర్కొన్నారు.
Recommended Video

విషాద వదనం..
సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకొచ్చి, ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కేసు నమోదు చేశారు. మరోవైపు పండుగ పూట వెంటకేశ్వరావు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోడి పందాలు తమ జీవనాధారాన్ని బలి తీసుకున్నాయని వాపోయారు. వెంకటేశ్వరరావు మృతితో ప్రగడవరం గ్రామం బోసిపోయింది. సరదా నిర్వహించిన కోడి పందాలు ఓ వ్యక్తి ప్రాణం తీశాయని స్థానికులు వాపోయారు.












Click it and Unblock the Notifications