కొత్త పెళ్లి కొడుకుని పొట్టన పెట్టుకున్న రోడ్డు ప్రమాదం
తిరుపతి: నూతన వధూవరులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మృత్యుదేవత వెంటాడింది. కొత్త పెళ్లి కొడుకును రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త కళ్ల ముందే చనిపోవడంతో ఆ నవ వధువును కుంగదీసింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న నవ వధువరుల బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన వెంకట ప్రసాద్(27)కు అదే మండలానికి చెందిన లక్ష్మిస్వాతి(19)తో సోమవారం ఉదయం వివాహమైంది. వివాహానంతరం స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్న వాళ్లు తూఫాన్ వాహనంలో సోమవారం రాత్రి బయలుదేరారు.

వాహనం మంగళవారం తెల్లవారుజామున కాజీపేట మండలం చెన్నముక్కపల్లె సమీపంలో రోడ్డు పక్కన నిలిపిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో తూఫాన్‌లో ప్రయాణిస్తున్న పెళ్లి కొడుకు వెంకట ప్రసాద్‌తో పాటు అతని బంధువు నర్సమ్మ(50) అక్కడికక్కడే మృతిచెందారు.
వాహనంలో ఉన్న మిగతా పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 సహాయంతో కర్నూలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పెళ్లి కూతురు లక్ష్మిస్వాతితో పాటు మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications