దారుణం: ప్రియురాలి కోసం ప్రేమికుడి హత్య, అరెస్టు

హత్యకు సంబంధించిన వివరాలను తాండూర్ సిఐ జలగం నారాయణరావు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. తుంగెడ గ్రామానికి చెందిన దెబ్బటి మహేశ్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. ఆ యువతి కాగజ్ నగర్‌లోని శ్రీలక్ష్మీ నర్సింగ్ హోంలో రిసెప్షనిస్టుగా విధులు నిర్వహిస్తోంది. అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మెకర్తి రవి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
అప్పటికే మహేశ్ ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్న మెకర్తి రవి ఎలాగైనా మహేశ్ అడ్డంకిని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 25న రవి, రఘులు మహేశ్‌కు ఫోన్ చేసి బెల్లంపల్లి కాల్‌టెక్స్‌లో కలుసుకుందామని చెప్పారు. వారు చెప్పిన విధంగా అక్కడికి చేరుకున్న మహేశ్ ను తీసుకుని మోటార్ సైకిల్‌పై తాండూరుకు చేరుకున్నారు. ముగ్గురు అక్కడే ఓ హోటల్‌లో భోజనం చేశారు.
ఆ తర్వాత కూల్ డ్రింక్స్ తీసుకుని రెబ్బెనకు చేరుకుని గ్లోబల్ కోల్ యార్డుకు వెళ్లే దారి పక్కన కూర్చున్నారు. మహేశ్ కూల్ డ్రింక్ సేవిస్తుండగా రఘు అతని కాళ్లు పట్టి లాగి కింద పడేశాడు. వెంటనే రవి అతని ఛాతిపై కూర్చుని సర్జికల్ బ్లేడుతో మహేశ్ గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో మహేశ్ మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పై పడేశారని పోలీసులు పేర్కొన్నారు. మహేశ్ మేనమామ నిందితులపై అనుమానం వ్యక్తం చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు రవి, రఘులను నిందితులుగా తేల్చారు.












Click it and Unblock the Notifications