విషాదం: దూసుకొచ్చిన కారు, అమెరికాలో తెలుగు టెక్కీ మృతి
పిట్స్‌బర్గ్: అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన వల్లభనేని హరీశ్(42) ప్రమాదవశాత్తు తన కారు కిందే పడి దుర్మరణం చెందారు. ఆన్‌లోనే ఉంచి కారు రిపేరు చేస్తుండగా అది ముందుకు దూసుకురావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పిట్స్‌బర్గ్‌లోని తన నివాసం ముందు సోమవారం ఈ ఘటన జరిగింది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ముదినేపల్లి మండల మాజీ ఉపాధ్యక్షుడు వల్లభనేని దాసు కుమారుడు వల్లభనేని హరీశ్ (42) ఆమెరికాలోని ఫిజ్‌బర్గ్‌లో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. హరీశ్, ఆయన భార్య సుష్మా అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు.
శనివారం ఉదయం 11 గంటలకు(ఇక్కడ రాత్రి 10 గంటలు) హరీశ్, ఆయన భార్య ఇద్దరు పిల్లలతో ఆస్పత్రికి వెళ్లారు. ప్రిస్కిప్షన్ రిపోర్టులు మరిచిపోవటంతో భార్యను, బాబును ఆస్పత్రిలోనే ఉంచి.. పాపతో కలిసి కారులో ఇంటికి వెళ్లారు. వైద్యుల రిపోర్టులు తీసుకుని తిరిగి బయలుదేరుతుండగా కారు మరమ్మతులకు గురయ్యింది.

కారు ముందు భాగంలోని ఇంజిన్‌ను హరీశ్ పరిశీలిస్తుండగా అది అకస్మాత్తుగా స్టార్టయ్యి ముందుకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ముందు భాగంలో ఉన్న హరీశ్‌ను కారు ఢీకొట్టి వెళ్లిపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. హరీశ్ మరణవార్త వినగానే ముదినేపల్లిలోని హరీష్ తల్లిదండ్రులు వల్లభనేని దాసు, ఝాన్సీ కన్నీరుమున్నీరుగా విలపించారు.
హరీశ్ భౌతికకాయానికి మంగళవారం రాత్రి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం న్యూయార్క్‌కు తీసుకువచ్చారు. కాగా, హరీశ్ మృతదేహం శుక్రవారానికి ముదినేపల్లి చేరుకుంటుందని బంధువులు భావిస్తున్నారు. హరీశ్ మృతితో ఆ కుటుంబంతోపాటు గ్రామం విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications