కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీపైన మర్రి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వైసిపి రాజకీయంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలో వైసీపీలో కీలకబాధ్యతలు పోషించిన వారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా రాజీనామాలు చేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితవాతావరణం నెలకొంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడంతో వైసీపీ అధినేత జగన్ కు షాక్ తగిలినట్టు అయింది.
పార్టీ నుంచి బయటకు వెళ్లి పోవడానికి కారణం జగన్: మర్రి రాజశేఖర్
మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుకు అందజేశారు. ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ నుంచి బయటకు వెళ్లి పోవడానికి కారణం జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తనకు సరైన గుర్తింపు లేదని చాలా చులకన భావంతో చూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తన కులమే తనకు శాపం అయింది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన కులమే తనకు శాపం అయిందని మర్రి రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని ఆయన చివరకు 2023 చివరలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మమ అనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమిపాలైన విడదల రజినికి చిలకలూరిపేట ఇన్చార్జిగా పట్టం కట్టారని ఆమెను బలోపేతం చేయడానికి తనను అవమానాలకు గురి చేశారని మర్రి రాజశేఖర్ ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీలో చేరతా
అంతేకాదు ఎంపీ కృష్ణదేవరాయలు వైసీపీలో ఉన్న సమయంలో తనపైన ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేయించారని ఆయన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తను సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా మర్రి రాజశేఖర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నలుగురు వైసిపి ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయ మంగళ వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేశారు.
జగన్ మోసం చేయటం వల్లే టీడీపీలో చేరుతున్నా
జగన్ తనను మోసం చేయడం వలనే తాను టిడిపిలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. ఆయన మాట తప్పారని, కానీ తాను పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేశానని ఆయన పేర్కొన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఆయన పద్ధతి నచ్చకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications