తుని విధ్వంసంలో జగన్, భూమన పాత్ర, విశాఖలో ప్లాన్: రావెల సంచలనం
విజయవాడ: కాపు గర్జన సమయంలో తునిలో చోటు చేసుకున్న విధ్వంసం ఘటనలో వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డిల పాత్ర ఉన్నట్లు సీఐడీ విచారణలో తేలిందని మంత్రి రావెల కిషోర్ బాబు శనివారం నాడు చెప్పారు.
తునిలో జరిగిన అల్లర్లకు విశాఖపట్నంలో వారు పథక రచన చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఐడీ విచారణలో భూమన కరుణాకర్ రెడ్డి నిందితుడిలా తేలారని చెప్పారు. తుని ఘటనతో సంబంధం ఉన్న జగన్, భూమనలను త్వరలో పోలీసులు అరెస్టు చేస్తారని చెప్పారు.
నిలకడగా ముద్రగడ ఆరోగ్యం
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష శనివారం నాడు పదో రోజుకు చేరుకుంది. గత రెండు రోజులుగా ఆయన వైద్య సేవలకు సహకరిస్తున్నారు. దీంతో ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు పరీక్షల్లో సాధారణం అని తేలిందని చెప్పారు.

కీటోన్స్ ప్రభావం కూడా తగ్గిందన్నారు. ఆహారం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని, కాకినాడ నుంచి వచ్చిన వైద్యులు, స్థానిక బొల్లినేని ఆసుపత్రికి చెందిన నిపుణులను అందుబాటులో ఉంచామని చెప్పారు. కాగా, శనివారం రాత్రి ముద్రగడ కుమారుడు గిరి, కోడలు సిరి దీక్ష విరమించారు.
ఇదిలా ఉండగా, తుని విధ్వంసకారుల పేరిట పోలీసులు అరెస్ట్ చేసిన పదమూడు మంది కాపు యువకులకు బెయిల్ వచ్చేదాకా తాను దీక్ష విరమించేది లేదని ముద్రగడ.. తనతో చర్చలు జరిపిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆయన తేల్చి చెప్పారు.
13 మందిలో 10 మందికి బెయిలొచ్చింది కదా, మిగిలిన ముగ్గురికి కూడా సోమ, లేదా మంగళవారం బెయిల్ వచ్చి తీరుతుందని వారు ముద్రగడకు నచ్చజెప్పే యత్నం చేశారు. ఆమరణ దీక్ష చేపట్టి పది రోజులు పూర్తైన నేపథ్యంలో కేవలం ఐవీ ఫ్లూయిడ్స్‌తోనే ఆరోగ్యం కుదుట పడదని, కీటోన్ బాడీస్ పెరిగితే ఆరోగ్యానికి ప్రమాదమని వారెంత చెప్పినా దీక్ష విరమణకు ముద్రగడ ససేమిరా అన్నారు.












Click it and Unblock the Notifications