హంద్రీనీవా సుజలా స్రవంతి ప్రారంభించిన రోజా: మెగా బ్రదర్ నాగబాబు పోస్ట్
హంద్రీనీవా సుజలా స్రవంతి ప్రారంభించిన రోజా అంటూ మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజాపై, జనసేన పార్టీ నాయకుడు, పిఏసి సభ్యుడు కొణిదెల నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. మంత్రి రోజా హంద్రీనీవా సుజల స్రవంతిని ప్రారంభించారని నాగబాబు పెట్టిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రోజాపైన నాగబాబు ఇంత మంచి పోస్ట్ పెట్టటం ఏమిటని చూసిన వాళ్ళంతా ఆ పోస్ట్ చూసి తెగ నవ్వుకుంటున్నారు.

రోజాపై నాగబాబు అదిరిపోయే పోస్ట్
ఇక ఈ పోస్టులో నాగబాబు హంద్రీనీవా సుజలా స్రవంతి (H N S S) ప్రారంభించిన మంత్రి రోజా, తాను చేసిన ఈ కార్యక్రమం ద్వారా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చారని ఒక ఫోటోను పోస్ట్ చేసి సెటైర్లు వేశారు. రాయలసీమ జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా అంటూ ఆయన రోజాను టార్గెట్ చేశారు. ఇక రోజా ప్రారంభించిన ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక దీనికి ఆయన ఒక చిన్న వాటర్ ట్యాంక్ నుండి తాగునీటిని రోజా బిందెల్లో పడుతున్న ఫోటోను పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో నాగబాబు పోస్ట్ వైరల్
మంత్రి రోజా చేసిన గొప్ప పని ఇది అని నాగబాబు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోజా చాలా పెద్ద ప్రాజెక్టును లాంచ్ చేశారని పలువురు స్పందిస్తున్నారు. ఇక రోజా ఫోటోలో ఉన్న వాటర్ ట్యాంక్ మీద వైయస్సార్ పోలవరం అని రాసి ఉండడం కూడా జనసేన నాయకులకు మరొక ఆయుధంగా మారింది. వైయస్సార్ పోలవరం ఇదే అంటూ నవ్వుకుంటున్నారు. పోలవరం పూర్తి కాదు కానీ ప్రచారం ఇలా ఉంటుంది అని సెటైర్లు వేస్తున్నారు. వైసీపీని టార్గెట్ చేస్తూ రోజా నీళ్ళ ట్యాంక్ వద్ద ఉన్న ఫోటోతో ట్రోల్ చేస్తున్నారు.
తాగునీటి బోర్ ను ప్రారంభించి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రోజా
ఇటీవల మంత్రి రోజా నిండ్ర మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. నింద్ర మండలంలో మంజూరైన 11 లక్షల నిధులతో తాగునీటి బోరు మరియు పైప్ లైన్లకు ఫిబ్రవరి 7వ తేదీన పూజ చేసి ప్రారంభించిన రోజా, బిందెలలో నీళ్లు పట్టి ఫోటోలకు ఫోజులిచ్చారు. గ్రామంలో ఇలా ప్రతిరోజు పండుగ వాతావరణంలో ప్రజలతో గడపడం ఎంతో సంతోషం కల్గించిందని మంత్రి రోజా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications