
ఒకే వేదికపై చిరంజీవి, పవన్-మోడీ భీమవరం టూర్ లో-ప్రజారాజ్యం తర్వాత- బీజేపీ వ్యూహమేనా?
విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల్ని భీమవరంలో నిర్వహిస్తున్న కేంద్రం.. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయపార్టీల నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన వారిని కూడా ఆహ్వానించింది. ముఖ్యంగా ప్రధాని మోడీ హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఏపీలో రాజకీయ పార్టీలతో పాటు సినీ రంగానికిచెందిన చిరంజీవి వంటి వారిని కూడా ఆహ్వానించింది. అయితే ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు.గతంలో ప్రజారాజ్యం పార్టీ ఉనికి కోల్పోయిన తర్వాత వీరిద్దరూ ఇలా ఒకే రాజకీయ వేదికపై కనిపించడం ఇదే తొలిసారి.

అల్లూరి జయంతిలో మోడీ
అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఏపీ రానున్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పలువురు అతిధుల్ని కేంద్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహిస్తూన్న పలు కార్యక్రమాలకు ఇదే తరహాలో అతిధుల్ని ఆహ్వానిస్తున్నారు.
దీంతో భీమవరానికి కూడా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారిని కూడా కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పలుకుతున్నారు.

మోడీ టూర్ లో చిరు, పవన్
భీమవరంలో ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తున్న కేంద్రం.. దీనికి మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆహ్వానం పలికింది. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా సినిమాలకే పరిమితం అవుతున్న చిరంజీవిని కళాకారుడిగానే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అలాగే బీజేపీ మిత్రపక్షమైన జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీంతో ప్రధాని మోడీ టూర్ లో మెగా బ్రదర్స్ ఒకేసారి దర్శనమివ్వబోతున్నారు.

ఒకే వేదికపై చిరు, పవన్
భీమవరంలో ఏర్పాటు చేసే బహిరంగసభలో ఒకే వేదికపై మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు.అయితే ఒకే వేదికపై కనిపించినా ఇద్దరూ రాజకీయంగా మాత్రం ఎలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు చేసే అవకాశం మాత్రం లేదు. ఇద్దరూ అల్లూరి సీతారామరాజు గొప్పతనం గురించి మాత్రమే మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ పాల్గొనే ప్రొటోకాల్ కార్యక్రమం కాబట్టి ఒకే స్టేజ్ పై వీరిద్దరికీ పక్కపక్కన కూర్చునే అవకాశం కల్పిస్తారా లేదా అన్నది కూడా ఇంకా నిర్ణయించలేదు.

ప్రజారాజ్యం తర్వాత ఇదే తొలిసారి
గతంలో ప్రజారాజ్యం పాప్టీలో చిరు, పవన్ ఇద్దరూ కలిసి పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీలో అన్నయ్య చిరు పార్టీ అధ్యక్షుడిగా కూడా తమ్ముడు పవన్ యువరాజ్యం బాధ్యతలు మోశారు. ఆ తర్వాత మాత్రం ఇద్దరూ రాజకీయాల గురించి కలిసి మాట్లాడిన సందర్భాలు లేవు. ఆ తర్వాత మాత్రం అన్నయ్య చిరుతో పవన్ కళ్యాణ్ బహిరంగంగా కనిపించే సందర్భాలు చాలా తక్కువగానే ఉంటున్నాయి. కేవలం సినిమా ఫంక్షన్లలోనే వీరిద్దరూ కలిసి దర్శనమిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రధాని మోడీ ఇప్పుడు వీరిద్దరినీ ఒక్కచోటికి చేర్చారు. వీరిద్దరి రాకతో భీమవరానికి మెగా అభిమానులు పోటెత్తే అవకాశాలున్నాయి.

బీజేపీ వ్యూహంలో భాగమేనా?
వాస్తవానికి ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితుల్లో బీజేపీ-జనసేన కూటమి తరఫున సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తున్నారు. అయితే బీజేపీలో ఆయనకు సీఎం పదవి ఇవ్వడంపై అభ్యంతరాలు ఉన్నాయి. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యాక సోమువీర్రాజు హైదరాబాద్ వెళ్లి చిరంజీవిని కలిసి వచ్చారు.
దీంతో ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారన్న ప్రచారం జరిగింది. అయితే చిరు మాత్రం తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ టూర్ కు చిరును రప్పించడం, ఆయన తమ్ముడు పవన్ తో కలిసి ఒకే వేదికపై కూర్చుబెట్టడం ద్వారా మెగా బ్రదర్స్ మద్దతు తమకే అన్న ప్రచారం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.