కాంగ్రెస్ అన్యాయం చేసింది, బాబుకు సహకరిస్తాం: మేకపాటి
నెల్లూరు/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తాము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి సహకరిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందన్నారు. ఇలా మాట మార్చడం సరికాదని ఎంపీ అన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్యాయంగా విభజించిందని, బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని పొందుపర్చలేదని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి తాము సహకరిస్తామని ఎంపీ మేకపాటి వివరించారు.
ఇదిలావుంటే, ఎపికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోరింది. బంద్‌కు సహకరించాలని అన్ని వర్గాల ప్రజలను కోరింది. 29వ తేదీ బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారంనాడు పార్టీ నాయకులు ఆవిష్కరించారు.

రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా విమర్శించారు. ప్రత్యోక హోదాను సాధించదడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో బంద్ అనివార్యమైందని ఆయన చెప్పారు. బంద్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజా సంఘాలన్నింటినీ కోరుతామని ఉమ్మారెడ్డి చెప్పారు. బంద్‌ను విజయవంతం చేస్తే ప్రజల అభిప్రాయం కేంద్రానికి తెలుస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications