ఎన్నికల్లో టీడీపీ అడ్డదారులు , మూన్నాళ్లుండే వ్యక్తిని చూసి రెచ్చిపోతున్న చంద్రబాబు : మంత్రి అనిల్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పర్వం కొనసాగుతోంది. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో టిడిపి అడ్డదారులు తొక్కుతుంది అని వైసీపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
నామినేషన్లు వేయటానికి దమ్ము లేదు కానీ ఆ సత్తా ఉందా ? టీడీపీకి వైసీపీ మంత్రి అనిల్ సవాల్

అచ్చెన్నాయుడు వైసిపి అభ్యర్థులను బెదిరిస్తున్నారని మంత్రి అనిల్ ఆగ్రహం
మూన్నాళ్ళు అధికారంలో ఉండే వ్యక్తిని చూసుకొని చంద్రబాబు రెచ్చిపోతున్నారు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని టార్గెట్ చేసి నిప్పులు చెరిగారు.
టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసిపి అభ్యర్థులను బెదిరిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగడుగునా అరాచకాలకు పాల్పడుతూ వైసీపీ పై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో 90 శాతానికి పైగా విజయం సాధించేది వైసిపి అభ్యర్థులేనని , గెలిచేది వైఎస్సార్ సీపీ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.

ఎన్ని అడ్డదారులు తొక్కినా ప్రజలు టీడీపీని ఆదరించరు
చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని అడ్డదారులు తొక్కినా గ్రామాలలో ఓటర్లు వారిని ఆదరించరని తేల్చి చెప్పేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
మొన్నటికి మొన్న నామినేషన్లు వేయడానికి దమ్ము లేదు కానీ ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నామినేషన్ వేసేశక్తి, ధైర్యం లేని పార్టీలు ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పుకుంటున్నాయి అని ఎద్దేవా చేశారు. అంతేకాదు ప్రతిపక్ష టీడీపీకి సవాల్ కూడా విసిరారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ . 25% సీట్లు సాధించే సత్తా ఉందా అని ప్రశ్నించారు .

పంచాయితీలపై పట్టు కోసం రాజకీయం .. మాటల యుద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ మంత్రులు, ఆయా జిల్లాలలో ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతూ అత్యధికంగా పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో టిడిపి పై విమర్శనాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఈ ఎన్నికలు ముఖ్యంగా వైసీపీ, టీడీపీలకు ప్రతిష్టాత్మకంగా మారటంతో ఎవరికి వారు దీటుగా ఎన్నికల వ్యూహాలలో నిమగ్నమై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటలతో కాక పుట్టిస్తున్నారు.పంచాయితీలపై పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు