విశాఖ పరిపాలనా రాజధాని; కొత్త జిల్లాలపై టీడీపీ అనుకూలమా? వ్యతిరేకమా?: మంత్రి అవంతి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ మూడు రాజధానులు అంశం తెరమీదకు వచ్చింది. తాజాగా మూడు రాజధానులు అంశం పై మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు ఏ విధంగా వచ్చాయో మూడు రాజధానులు కూడా అదేవిధంగా వస్తాయని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని గా మారడం ఖాయం అంటూ అవంతి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఎప్పుడూ ఊహలలో, అయోమయంలో ఉంటారంటూ ఎద్దేవా
ఇక ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు ఎప్పుడూ ఊహలలో, అయోమయంలో ఉంటారంటూ ఎద్దేవా చేశారు. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొత్త జిల్లాలకు టిడిపి అనుకూలమా? ప్రతికూలమా? అనేది చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబును ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబు మంచిని స్వాగతించలేరని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి జిల్లాల ప్రకటన చేశారని చెప్పడం అసంబద్ధమైన మాటని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

చారిత్రాత్మక నిర్ణయానికి తగ్గట్టుగా నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం
ఎన్నికల ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారని మంత్రి అవంతి శ్రీనివాస్ గుర్తుచేశారు. ఇక ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి తగ్గట్టుగా నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి గిరిజనుల పై అభిమానులు ఎక్కువగా ఉండటం వల్ల, రెండు జిల్లాలు ఏర్పాటు చేసి గిరిజన జిల్లాల అభివృద్ధికి పెద్దపీట వేశారని మంత్రి అవంతి స్పష్టం చేశారు.

కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంలో ఎటువంటి రాజకీయాలకు ఆస్కారం లేదు
కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల పరిపాలన సౌలభ్యం కలుగుతుందని, శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే అన్ని వర్గాలు జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించాలని మంత్రి అవంతి విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంలో ఎటువంటి రాజకీయాలకు ఆస్కారం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారని అందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.

మూడు రాజదానులకు, కొత్త జిల్లాలకు లింక్ పెట్టటం సరైనది కాదు
మూడు రాజధానులకు, కొత్త జిల్లాల కు లింకు పెట్టి మాట్లాడటం సరైన విధానం కాదని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరణ వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా అనేది చంద్రబాబు ఆలోచించాలన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఉద్యోగుల సమస్య తాత్కాలికమైన సమస్య అన్న మంత్రి అవంతి శ్రీనివాస్
ఇక ఇదే సమయంలో వంగవీటి రంగా పేరును జిల్లాకు పెట్టమని అక్కడ ప్రజలు కోరుకుంటే కమిటీ పరిశీలిస్తుందని, రాష్ట్రంలో నెలకొన్న ఉద్యోగుల సమస్య తాత్కాలికమైన సమస్య అని, ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు . పీఆర్సీకి జిల్లాలకు లింక్ పెట్టడం సరైంది రాదని మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు .