ప్రధానమంత్రి పర్యటనలో ఒకటి తగ్గింది?
రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పు ద్వారా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్లేనని రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. భూసేకరణకు సంబంధించి తదుపరి ప్రక్రియ పూర్తిచేయడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించిందని, త్వరలోనే భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన జరగనుందని వెల్లడించారు. ఈనెల 11న ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారని, ఆ రోజు భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన ఉండదని స్పష్టం చేశారు.
భోగాపురం విమానాశ్రయం విషయంలో కోర్టు తీర్పు ఇచ్చిన దృష్ట్యా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులతో మంత్రి బొత్స సమీక్షించారు. విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయాలకు త్వరలోనే శంకుస్థాపన ఉంటుందని, గిరిజన విశ్వవిద్యాలయం భూ సేకరణలో భాగంగా రైతుల నుంచి పూర్తి స్థాయిలో అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

నవంబర్ 11వ తేదీ సాయంత్రం ప్రధాని విశాఖపట్నం చేరుకుంటారు. ఆ రోజు మధ్యాహ్నానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారు. 12వ తేదీన రూ.10,842.47 కోట్ల విలువైన ప్రాజెక్ట్ పనులను మోడీ ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన వర్చువల్ మోడ్‌లో నిర్వహిస్తారు. వీటిల్లో రెండు రైల్వే ప్రాజెక్టులు, పెట్రోలియం, సహజ వాయువు, మూడు రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, ఒక మత్స్యకార ప్రాజెక్ట్ ఉన్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖపట్నం రావడం మూడోసారవుతుంది.












Click it and Unblock the Notifications