చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చేస్తున్నది రాజకీయవ్యభిచారం: మంత్రి దాడిశెట్టి రాజా షాకింగ్ వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికల పొత్తులపై ఇప్పటి నుంచే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆసక్తి చూపుతున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం పడరాని పాట్లు పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

పొత్తులపై ఏపీలో కొత్త పంచాయితీ
ఏపీలో పొత్తుల రాజకీయాలపై ఇప్పటి నుండి వాడి వేడి చర్చ సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పని చేస్తున్నాడు అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, వైసిపి ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తీరుతుందని, మళ్లీ ప్రజలు ఆదరించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నే అని తేల్చి చెబుతున్నారు.

చంద్రబాబుతో కలవడానికి పవన్ కళ్యాణ్ తహతహ: దాడిశెట్టి రాజా
ఇదిలా ఉంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తాజా పొత్తుల వ్యాఖ్యలపై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో కలవడానికి పవన్ కళ్యాణ్ తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతుందని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. చంద్రబాబు పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం అని చెబుతున్న పవన్ కళ్యాణ్ కు సిగ్గుందా అంటూ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ చేస్తుంది రాజకీయ వ్యభిచారం: ఏపీ మంత్రి
రాజకీయాలలో పవన్ కళ్యాణ్ కు సిద్ధాంతం అంటూ లేదని, చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో చేస్తుంది రాజకీయం కాదని రాజకీయ వ్యభిచారం అని మంత్రి దాడిశెట్టి రాజా విరుచుకుపడ్డారు. ముందు పవన్ కళ్యాణ్ తో అనిపించి, ఆ తర్వాత పొత్తులపై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత, చంద్రబాబు పొత్తులపై మాట్లాడాడని ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుందంటూ దాడిశెట్టి రాజా ఆరోపించారు.

ఇన్ని పార్టీలతో పొత్తుల డ్రామాలు ఆడుతున్న ఏకైక పార్టీ జనసేన
ఇన్ని పార్టీలతో పొత్తుల డ్రామాలు ఆడుతున్న ఏకైక పార్టీ జనసేన అని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్ సింగిల్ గానే ఉంటారని, ప్రజలు ఆయన వెంటే ఉన్నారని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకోనని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు మర్చిపోయారా అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు దాడిశెట్టి రాజా. ఇదిలా ఉంటే సోమవారం నాడు రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తుని పట్టణంలోని వాలంటీర్లకు సేవా రత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications