వైసీపీలో బాలినేని వ్యవహారం.. టీ కప్పులో తుఫాను లాంటిదన్న మంత్రి కాకాణి
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి రీజినల్ కోఆర్డినేటర్ గా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు అన్న ప్రచారం జోరుగా సాగుతుంది.
ఈ ప్రచారం పై స్పందించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేవలం ఇది సోషల్ మీడియా సృష్టి అంటూ వ్యాఖ్యలు చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కి పార్టీలో సముచిత గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడైన ఆయన గౌరవానికి ఎటువంటి భంగం కలగదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఇదంతా ప్రచారమని, టీ కప్పులో తుఫాను లాంటిదే నంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

బాలినేని శ్రీనివాసరెడ్డితో పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా వైసిపి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. తాజాగా ఆయన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్ లో ఉన్నట్టు సమాచారం.
వైయస్ జగన్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రివర్గ విస్తరణలో రెండోసారి మంత్రిగా అవకాశం దక్కించుకోలేదు. జగన్ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసిపి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో బాలినేని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.












Click it and Unblock the Notifications