పాఠశాలల్లో జగన్ మార్పులు - లోకేష్ తాజా ఆదేశాలు..!!
ఏపీ విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ తొలి సమీక్ష చేసారు. మాజీ సీఎం జగన్ తన హాయంలో పాఠశాలలు, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల గురించి ప్రతీ సందర్భంలోనూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ విద్యాశాఖ బాధ్యతలను ఏరి కోరి ఎంచుకున్నారు. జగన్ మార్క్ ను అధిగమించాలనే లక్ష్యంతో ఉన్నారు. దీంతో, తన శాఖ పైన నిర్వహించిన తొలి సమీక్షలోనే అధికారులకు లోకేష్ కీలక ఆదేశాలు ఇచ్చారు. మౌలిక సదుపాయాల పైన ఫోకస్ చేసారు.
కీలక సూచనలు
ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్థంతరంగా నిలిచిపోయిన ఫేజ్-2 పనులు, ఫేజ్-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తిచేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా మధ్యాహ్నభోజన పథకం సూచించారు. పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

నివేదిక ఇవ్వండి
అదేవిధంగా గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష ఎస్పీడీని ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు కూడా అందజేయాలని అన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులకు పాఠశాల ఎంత దూరంలో అందుబాటులో ఉంది అనే వివరాలతో నివేదిక రూపొందించాలని కోరారు. గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని అన్నారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకుని, సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ ను కూడా అందజేయాలని డైరెక్టర్ లైబ్రరీస్ ను ఆదేశించారు.
కిట్స్ ను అందించాలి
బైజూస్ కంటెంట్, ఐఎఫ్ బి వినియోగం మీద సమగ్ర నోట్ ను సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీబీఎస్ఈ పాఠశాలల మీద సమగ్ర నోట్ తో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోయే 82వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు, అదే విధంగా ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో సమగ్ర నోట్ ఇవ్వాలని మంత్రి లోకేష్ చెప్పారు. స్టూడెంట్ కిట్ ను అందించడాన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని అన్నారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ అందించాలని లోకేష్ ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి, మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేష్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications