కాంగ్రెస్‌కు మాట్లాడే హక్కు లేదు, దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి నారాయణ
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో శనివారం మంత్రి నారాయణ పర్యటించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయ నిర్మాణం ఆగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అనుకున్న ప్రకారమే జూన్ 27 నుంచి 11,500 మంది ఉద్యోగులు నూతన సచివాలయంలో పనిచేస్తారని ఆయన వెల్లడించారు. టీడీపీ-బీజేపీ మధ్య వివాదాలు సృష్టించేందుకు కాంగ్రెస్, వైసీపీలు ప్రత్యేక హోదాను ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ధ్వజమెత్తారు. ఈనెల 30 లోపు సచివాలయ అన్ని భవనాల శ్లాబు పనులు పూర్తవుతాయని, వీటితో పాటు సమాంతరంగా అంతర్ నిర్మాణ పనులు కూడా చేపడతామని మంత్రి చెప్పారు. రాజధానికి వచ్చేందుకు ఉద్యోగులు లేవనెత్తిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని, ఏవైనా లోపాలు ఉన్నాయని వారు ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పస్టం చేశారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను వేగిరం చేయాలని మంత్రి అధికారులకు ఈ సందర్భంగా సూచించారు.
తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను నిర్మాణ సంస్ధలైన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్ధలు శరవేగంగా చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాత్కాలిక సచివాలయ ప్రాంతంలో కార్మికులకు అవసరమైన వసతులను ఏర్పాటు చేసేందుకు సంస్ధలు ముందుకొచ్చాయి.
ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగానే జూన్ 15 నాటికల్లా తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యం దిశగా పనులు సాగుతున్నాయి. మొత్తం ఆరు భవనాల్లో షాపూర్జీ పల్లోంజీ సంస్ధ నిర్మిస్తున్న 1,2 భవనాలకు సంబంధించి శ్లాబు సెంట్రింగ్‌ను రెండు రోజులుగా తొలగిస్తున్నారు.
మరోవైపు ఎల్ అండ్ టీ నిర్మించే భవనాలకు సెంట్రింగ్‌ను తొలగించే పని లేకుండానే పిల్లర్లపై కాంక్రీటు దిమ్మెలను నిలిపి, మధ్యలో ఇనుప గడ్డర్లను వేసి, స్టీలు రేకులు పరిచి, దానిపై శ్లాబు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications