మైనింగ్ అక్రమాలా.. అబ్బే అవేం జరగలేదు: చంద్రబాబువి చౌకబారు ఆరోపణలన్న మంత్రి పెద్దిరెడ్డి
రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి మధ్య మాటల యుద్ధానికి అంతే లేకుండా పోతుంది. ఒకవైపు టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని వైసీపీ నేతలు నిరూపించే ప్రయత్నాలు చేస్తుంటే, వైసిపి హయాంలో అవినీతి జరుగుతుందంటూ, అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తుంది. ఇక తాజాగా మైనింగ్ అక్రమాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రివర్స్ ఎటాక్ చేశారు.

రుషికొండ తవ్వకాలపై, వైసీపీ మైనింగ్ మాఫియా అంటూ చంద్రబాబు ఆరోపణలు
తాజాగా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్ సభ్యులు రాష్ట్రంలోని కొండలను కూడా వదలడం లేదని వాటిని కూడా చెరువులుగా, భూములుగా మార్చేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతమైన విశాఖపట్నంలోని రుషికొండ ను కూడా ధ్వంసం చేశారని చంద్రబాబు విమర్శించారు .
అలాగే విశాఖ- తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని బమిడికలొద్దిలో భారతి సిమెంట్ కోసం తవ్వకాలు జరుపుతున్నారని, ఇక ఇదే సమయంలో కర్నూలు రవ్వలకొండను తవ్వారని, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాలో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు అని పేర్కొన్నారు. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ హయాంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని చంద్రబాబు ఆరోపించారు.

చంద్రబాబు ఆరోపణలపై మండిపడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఇక చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మైనింగ్ అక్రమాలు జరిగాయని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రుషికొండ లో ఎటువంటి అక్రమాలు జరగలేదని, చంద్రబాబు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మైనింగ్ అక్రమాలా.. అబ్బే అలాంటిదేమీ జరగలేదన్న మంత్రి తెలుగుదేశం పార్టీ కావాలని వైసీపీ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రుషికొండ తవ్వకాలపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు.

రుషికొండలో మైనింగ్ అక్రమాలు జరగలేదు .. కుప్పంలోనూ ఇలాగే దుష్ప్రచారం
రుషికొండలో మైనింగ్ అక్రమాలు జరిగాయని చెప్తున్నట్టే కుప్పం మైనింగ్ విషయంలోనూ టిడిపి నేతలు ఇటువంటి అబద్ధాలనే ప్రచారం చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అధికారులు స్వయంగా పర్యవేక్షించి అక్రమ మైనింగ్ జరగడం లేదని తేల్చారు అని మంత్రి వివరించారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రౌడీయిజం చేస్తున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ హయాంలోనే మైనింగ్ అక్రమాలు జరిగాయని, వైసిపి హయాంలో వాటికి అడ్డుకట్ట వేశామని, గతంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు.

ఏపీ మైనింగ్ శాఖకు కేంద్రం కితాబు .. కానీ టీడీపీ అబద్దపు ప్రచారం చేస్తుందన్న మంత్రి
వైసిపి హయాంలో ఎన్నో సంస్కరణలతో రాష్ట్ర ఆదాయాన్ని పెంచామని పేర్కొన్న ఆయన, ఇసుక టెండర్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించామని, శాటిలైట్ సిస్టం ద్వారా ఇసుక రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము అని పేర్కొన్నారు.
ఏపీ మైనింగ్ శాఖ కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయని, అటువంటి మైనింగ్ శాఖలో అక్రమాలు జరుగుతున్నాయంటూ టిడిపి నేతలు చెప్పడం హాస్యాస్పదమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications