చంద్రబాబు హయాంలో ఐదేళ్లు భ్రమల్లోనే; ఓఆర్ఆర్ పై తప్పులు వాళ్ళు చేసి ఇప్పుడు విమర్శలా: మంత్రి పేర్నినాని
తెలుగుదేశం పార్టీపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పేర్ని నాని మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పేర్ని నాని రాష్ట్రంలో తాజా పరిణామాలపై, టీడీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఐదేళ్లు భ్రమల్లోనే బ్రతికారు
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేదని పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఐదేళ్లు భ్రమలోనే బ్రతికారని అన్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు మధ్యలోనే వదిలేశారని అసహనం వ్యక్తం చేశారు మంత్రి పేర్ని నాని. విజయవాడ ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడైనా చంద్రబాబు పట్టించుకున్నారా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ కు మోక్షం లభించిందని పేర్ని నాని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి పై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే చిత్తశుద్ధి ఉందని పేర్ని నాని అభిప్రాయపడ్డారు.

అమరావతి పాదయాత్రకు పెట్టిన ఖర్చు కూడా అమరావతి నిర్మాణానికి పెట్టలేదు
అమరావతి పాదయాత్ర కు పెట్టిన ఖర్చు కూడా రాజధాని నిర్మాణానికి చంద్రబాబు పెట్టలేదని మండిపడ్డారు. అమరావతి రాజధాని కాదని ఎవరైనా చెప్పారా అంటూ ప్రశ్నించిన పేర్నినాని శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. అమరావతిని నిజంగా అభివృద్ధి చేయగలిగే నేత వైయస్ జగన్మోహన్ రెడ్డినేనని స్పష్టం చేశారు పేర్ని నాని. రాజధాని గ్రామాల ప్రజలకు ఇప్పటికే వాస్తవం అర్థమైందని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఉనికిలో లేని ఔటర్ రింగ్ రోడ్డుపై ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందని పేర్నినాని నిప్పులు చెరిగారు.

గూగుల్ మ్యాప్ లో గీత గీసి అదే ఔటర్ రింగ్ రోడ్డు అన్న గత టీడీపీ ప్రభుత్వం
ఔటర్ రింగురోడ్డుపై 2016 లోనే రిపోర్టు తయారు చేశారని పేర్కొన్న పేర్నినాని, కేంద్రం ముందుగా భూమిని సేకరించమని చెప్పినప్పటికీ గూగుల్ మ్యాప్ లో ఒక గీత గీసి అదే ఔటర్ రింగ్ రోడ్డు అని చెప్పారని చంద్రబాబు కనీసం డిపిఆర్ కూడా తయారు చేయలేక పోయారని అసహనం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ ను విమర్శించడమే పనిగా పెట్టుకొని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో బెంజ్ సర్కిల్ రెండవ ఫ్లై ఓవర్ కు అనుమతి సంపాదించి నిర్మాణం కూడా పూర్తి చేశారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

అధికారంలో ఉండి అప్పుడు చెయ్యలేదు .. ఇప్పుడు మాపై విమర్శలా?
విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు కట్టాలంటే ఎనిమిది వేల ఎకరాలు అవసరమని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయలేక పోయిన టిడిపి నేతలు ఇప్పుడు మేం చేయలేదని విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు టిడిపి నేతలు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి అని పేర్కొన్నారు పేర్నినాని. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా పేర్నినాని నిప్పులు చెరిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు . సీఎం వైఎస్ జగన్ ను తిట్టడం తప్ప పవన్ కళ్యాణ్ ఏమైనా సాధించారా అంటూ పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications