'సీఎంగా విజయ్ కు ఆ పార్టీల మద్దతు వెనుక స్టాలిన్ కీలక పాత్ర, కండీషన్స్ అప్లై..!!
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడుతోంది. రాజకీయంగా కొనసాగిన సస్పెన్స్ కు తెర పడింది. విజయ్ ప్రభుత్వంలో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్.. వీసీకే, వామపక్షాలు మద్దతు కీలకం గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ సీఎం స్టాలిన్ పాత్ర ఆసక్తిని పెంచింది. విజయ్ కు మద్దతిచ్చిన కాంగ్రెస్ తో విభేదించిన స్టాలిన్.. ఆ తరువాత వ్యూహం మార్చారు. స్టాలిన్ మార్క్ రాజకీయం ఇప్పుడు విజయ్ ప్రభుత్వం.. అటు ప్రతిపక్ష పాత్ర పైన భవిష్యత్ లో ప్రభావం చూపటం ఖాయంగా కనిపిస్తోంది.
విజయ్ కు ముందుగా కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. వెంటనే కాంగ్రెస్ పైన డీఎంకే విరుచుకు పడింది. కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పింది. అయితే, నెమ్మదిగా స్టాలిన్ వ్యూహం మార్చారు. తన మిత్ర పక్షాలు విజయ్ కు దగ్గరయ్యేలా చేసారు. విజయ్ ప్రభుత్వం తన మిత్రపక్షాల పైన ఆధారపడి కొనసాగే విధంగా వ్యూహం మార్పు చేసారు. కాంగ్రెస్ మాత్రమే కాదు.. తన కనుసన్నల్లోని పార్టీలే విజయ్ ప్రభుత్వ భవిష్యత్ ను డిసైడ్ చేసే విధంగా తన చేతిలోకి రిమోట్ తెచ్చుకున్నారు. అందు లో భాగంగా సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలకు విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. ఏఐఎంఎల్ తొలుత మద్దతు ప్రకటించినా.. తరువాత నిర్ణయం మార్చుకుంది. ఇటు.. విజయ్ ను కలిసి వీసీకే నేత తిరమావళవన్ మద్దతు ప్రకటించారు. మద్దతు పైన లేఖ మాత్రం ఇవ్వ లేదు. ఆ తరువాత స్టాలిన్ తో సమావేశం అయ్యారు. లేఖ ఇచ్చే అంశం పైన నిర్ణయం ఈ రోజుకు వాయిదా పడింది. దీంతో.. విజయ్ ప్రమాణ స్వీకారం మరోసారి క్యాన్సిల్ అయింది.

వ్యూహాత్మకంగా పట్టు బిగించిన స్టాలిన్
ఇక, అటు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. విజయ్ కు మిత్రపక్షాలుగా ఉన్న సీపీఐ, సీపీఎం అగ్ర నేతలతో నేరుగా ఖర్గే మంత్రాంగం చేసారు. ఆ రెండు పార్టీలు భేషరతుగా విజయ్ కు మద్దతు ఇచ్చేలా ఒప్పించారు. స్టాలిన్ వ్యూహాత్మక ఎత్తుగడలు గమనించిన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను తొలుత హైదరాబాద్.. ఆ తరువాత బెంగళూరు తరలించింది. కాంగ్రెస్ విజయ్ కూటమిలోకి వెళ్లినా.. తన మిత్రపక్షాల అవసరం గుర్తించేలా లాస్ట్ మినిట్ లో స్టాలిన్ చక్రం తిప్పారు. వీసీకే సైతం మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ రోజు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. అందులో స్టాలిన్ మద్దతు దారులే కీలకం కానున్నారు. ఇక.. అటు అన్నా డీఎంకే కు ప్రతిపక్ష పాత్ర లేకుండా.. అవసరమైన నెంబర్ తన సొంతం అయ్యేలా స్టాలిన్ వ్యూహాలను అమలు చేస్తున్నారు. దీంతో.. అటు ప్రభుత్వం.. ఇటు ప్రతిపక్షం తన చేతిలోనే ఉండే విధంగా తన మార్క్ రాజకీయంతో ఎన్నికల్లో ఓడినా స్టాలిన్ తన పట్టు జారకుండా జాగ్రత్త పడుతున్నారు.













Click it and Unblock the Notifications