మోహన్ బాబు ఇంటికి మంత్రి పేర్ని నాని - సీఎం భేటీ వివరాలు : ఆకస్మిక భేటీ వెనుక..!!
ప్రముఖ సినీ హీరో..నిర్మాత మోహన్ బాబు వద్దకు స్వయంగా ఏపీ మంత్రి వెళ్లారు. కొంత కాలంగా సినీ రంగ సమస్యల పైన సీఎం జగన్ నేరుగా మెగాస్టార్ చిరంజీవితో చర్చలు చేస్తున్నారు. ఈ చర్చల్లో ఎక్కడా మోహన్ బాబు పాల్గొన లేదు. అదే సమయంలో చిరంజీవికే పెద్దరికం ఇవ్వటం పైన ఇండస్ట్రీ నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, చిరంజీవి తాను స్వయంగా సీఎం ఆహ్వానిస్తే వచ్చానంటూ గతంలో జరిగిన చర్చల సమయంలో వెల్లడించారు. అదే విధంగా గురువారం జరిగిన చర్చల్లోనూ పాల్గొన్న హీరోలు సైతం సీఎం జగన్ ను అదే సమయంలో చిరంజీవిని అభినందించారు.

చిరంజీవికి ప్రాధాన్యతతో...
సమావేశంలో చిరంజీవి సైతం తాను ఇండస్ట్రీలో అందరితో చర్చించే ఈ మీటింగ్ కు వచ్చినట్లుగా వివరించారు. అయితే, ఈ సమావేశానికి ఆలీ.. పోసాని లాంటి వారిని ఆహ్వానించి.. మోహన్ బాబు రాకపోవటం పైన అసలు ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉందా..లేదా.. ఆహ్వానించినా మోహన్ బాబు రాలేదా అనే చర్చ టాలీవుడ్ సర్కిల్స్ లో కొనసాగుతోంది. అయితే, గత నెలలో సీఎం జగన్ - చిరంజీవి మధ్య సమావేశాన్ని "మా" అధ్యక్షుడు మంచు విష్ణు పర్సనల్ మీట్ గా వ్యాఖ్యానించారు. ఇక, ఆలీకి త్వరలో పార్టీ నుంచి ప్రాధాన్యత లభించబోతోందనే ప్రచారం సాగుతోంది. మోహన్ బాబు సైతం వైసీపీ గెలుపు కోసం పని చేసారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ లో చేరిన మోహన్ బాబు..ఎన్నికల్లో ప్రచారం చేసారు.

మోహన్ బాబు ఇంటికి మంత్రి వెళ్లటంతో...
ఆ తరువాత ఆయనకు రాజ్యసభ ఇస్తారని..టీటీడీ ఛైర్మన్ ఇస్తారంటూ పలు రకాల ప్రచారం సాగింది. కానీ, మోహన్ బాబు మాత్రం తాను జగన సీఎం కావాలని కోరుకున్నానని..అది జరిగింది చాలంటూ చెప్పుకొచ్చారు. అయితే, ఇండస్ట్రీలో కేవలం చిరంజీవి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించటం పైన మోహన్ బాబు కినుక వహించినట్లుగా ప్రచారం సాగుతోంది. సీఎం జగన్ కు బంధువు అయిన మోహన్ బాబు కొంత కాలంగా..సీఎంను కలవలేదు.

మోహన్ బాబుతో మంత్రి ఏం చర్చించారు
సినీ సమస్యల పరిష్కారం.. టికెట్ ధరల అంశం పైన వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సినీ పెద్దలతో జరిగిన చర్చల సారాంశాన్ని వివరించే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. పేదల పైన భారం పడకుండా.. సినీ ఇండస్ట్రీకి నష్టం లేకుండా టికెట్ ధరల పైన నిర్ణయం ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను జగన్ సీఎం కావాలని కోరుకొని..ఆయన కోసం పని చేస్తే... సినిమా వ్యవహారాల్లో చిరంజీవిని స్వయంగా ఆహ్వానించి.. ప్రాధాన్యత ఇవ్వటం పైన మోహన్ బాబు అసహనంతో ఉన్నట్లుగా టాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.అయితే, ఇప్పుడు పేర్ని నాని స్వయంగా తన ఇంటికి వచ్చి... చర్చలు చేయటం...ప్రభుత్వ ఆలోచనలు పంచుకోవటంతో మోహన్ బాబు స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.

మోహన్ బాబు ఆహ్వానం మేరకే...
మంత్రి పేర్ని నాని నేరుగా మోహన్ బాబు ఇంటికి వెళ్లి సమావేశం అవ్వటం పైన తాజాగా మరో సమాచారం అందుతోంది. మోహన్ బాబుతో మంత్రి పేర్ని నాని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని చెబుతున్నారు. పేర్ని నాని ని మోహన్ బాబు అల్పాహారానికి ఆహ్వానించారని...దీంతో ఆయన ఇంటికి మంత్రి వెళ్లారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సమావేశం సమయంలో సినీ పరిశ్రమ సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రస్తావనకు వచ్చాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం జరిగిన సమావేశాలకు ఆయన రాలేకపోయారని.. దీంతో, మంత్రి హైదరాబాద్ వస్తున్నారనే విషయం తెలిసి ... మోహన్ బాబు తన ఇంటికి ఆహ్వానించారనేది పార్టీ నేతల సమాచారం.












Click it and Unblock the Notifications