బంద్ అన్నారుగా... హెరిటేజ్ ఎందుకు ముయ్యలేదు? మంత్రులు పెద్దిరెడ్డి, రోజా!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత టీడీపీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే .అయితే తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన బంద్ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడంలేదని, బంద్ ఎక్కడా కొనసాగడం లేదని వైసిపి మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు.
చంద్రబాబు అవినీతి చేయలేదని టిడిపి నేతలు చెప్పలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కేవలం సాంకేతిక కారణాలు చూపి అక్రమ అరెస్టు గా చెబుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు ని అరెస్ట్ చేసిన సమయంలో ప్రజల నుంచి ఎటువంటి నిరసన వ్యక్తం కాలేదని ఆయన అన్నారు.

టిడిపి బంద్ ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని, చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ కూడా నడుస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాబు చేసిన స్కాములు అన్ని పక్కా ఆధారాలతో బయటకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
చంద్రబాబుపై ఇంకా చాలా కేసులు ఉన్నాయని, సిఐడి అధికారులు వాటన్నిటిని దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి కేసుల్లో చంద్రబాబు ఇంతకాలం స్టేలతో కాలం గడిపాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పతనం అంటే ఏమిటో చంద్రబాబుకు తెలుస్తోందని, చంద్రబాబు దుర్మార్గపు వ్యవస్థ కూలిపోతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే వైసిపి మంత్రి రోజా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును మరోమారు టార్గెట్ చేశారు. బంద్ అన్నారు గా... చంద్రబాబు సొంత జిల్లాలో, సొంత సంస్థ అయిన హెరిటేజ్, హెచ్ ఎఫ్ లిమిటెడ్ ఎందుకు మూయలేదు చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు నిన్ను లోపలేస్తే మీ సంస్థలు మాత్రం వ్యాపారాలు చేసుకుని సంపాదించుకోవాలి ఇతరులు మాత్రం నష్ట పోవాలి అంతేగా అంటూ వైసిపి మంత్రి రోజా టార్గెట్ చేశారు.

హెరిటేజ్ తెరిచి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. బంద్ లేదు బొక్క లేదు అంటున్న వాళ్ళ కంపెనీ అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఏపీలో టీడీపీ బంద్ విఫలం అంటూ వైసీపీ నేతలు పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు అనుకున్న సానుభూతి ప్రజల్లో లేదని వారంటున్నారు.












Click it and Unblock the Notifications