సింహం సింహమే.. పందులు పందులే.. వైసీపీ రెబల్స్ పై మంత్రి రోజా ఘాటువ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మంత్రి రోజా పోటీ చేస్తున్న నగరి నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి, రోజాపై సంచలన ఆరోపణలు చేసిన అసంతృప్త నాయకులు, తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మంత్రి రోజా తీరుపై ధ్వజమెత్తారు.
తనను ఓడించడానికి అందరూ ఏకమయ్యారు
వీరు నిర్వహించిన మీడియా సమావేశానికి టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ కూడా హాజరు కావడంతో వారు టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో వైసీపీకి తలనొప్పిగా మారిన రెబల్స్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఓడించడానికి అందరూ ఏకమయ్యారు అని పేర్కొన్న మంత్రి రోజా ఎంతమంది ఒకటైన పందులు పందులే సింహం సింహమే అన్నారు.

వెన్నుపోటు పొడిచి టిడిపికి మద్దతిస్తున్నారు
ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రోజా జగనన్న బాగుంటేనే మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయని పేర్కొన్నారు. నగరి నియోజకవర్గంలో అన్ని పదవులు అనుభవించి, క్వారీలలో అక్రమంగా సంపాదించుకుని, కొందరు నేతలు తనను వెన్నుపోటు పొడిచి టిడిపి చెంతకు చేరారని రోజా విమర్శించారు. నన్ను ఓడించడం కోసం నగరి టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ ను గెలిపించడానికి తిరుగుతున్నారని రోజా మండిపడ్డారు.
నగరిలో వారికి బుద్ధి చెప్పండి
వెన్నుపోటు దారులకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరిన రోజా మీకు మంచి చేసిన తనను గెలిపించాలని నగరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక నగరిలో విజయం సాధించడం కోసం రోజా తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. మరోసారి నగరిలో రోజా విజయం సాధించాలని, అందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరుతున్నారు.
ఎదురీదుతున్న రోజా
అయితే నగరి నియోజకవర్గంలో మాత్రం వైసిపి నుండి బయటకు వెళ్లిన అసంతృప్తులు ఒకవైపు, ప్రజలలోను రోజా పని తీరుపై ఉన్న కొంత అసంతృప్తి వెరసి రోజా ఎదురీదుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక ఐదు రోజులు మాత్రమే పోలింగ్ కు సమయం ఉండడంతో ఓటరు దేవుళ్ళ తీర్పు ఏ వైపు ఉంటుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications