తడిగుడ్డతో గొంతు కోసే వ్యక్తి చంద్రబాబు: మండిపడ్డ మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎన్నికలు రాకముందే ఏపీలో ఎన్నికల వేడి కనిపిస్తుంది. నువ్వా నేనా అంటూ ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహిస్తుంటే, మంత్రి రోజా చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
ఇప్పటికే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించడానికి చంద్రబాబుకు హక్కు లేదని చంద్రబాబు పై అంబటి రాంబాబు వంటి నేతలు ఫైర్ అయ్యారు. ఇక తాజాగా రోజా కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని, అటువంటి చంద్రబాబు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుండడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు ఎన్టీఆర్ పైన అంత అభిమానం ఏమీ లేదని, కేవలం ఎన్టీఆర్ పేరు చెప్పుకొని అధికారంలోకి రావడానికి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి రోజా విమర్శించారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబుకు ఎన్టీఆర్ పైన ప్రేమ ఉంటే 14 సంవత్సరాల పాటు సీఎంగా పని చేసి, ఒక్క జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా? అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తాడు అని, ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు వస్తుందని రోజా మండిపడ్డారు. ఎన్టీఆర్ లాంటి వెన్నుపోటు దారుడు మరెవరూ లేరు అన్న రోజా తడిగుడ్డతో గొంతు కోసే వ్యక్తి చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. అవసరాన్ని బట్టి ఊసరవెల్లిలా రంగులు మార్చడం చంద్రబాబు నైజం అని మంత్రి రోజా పేర్కొన్నారు.
గతంలో భార్యను చూసుకోలేనోడు దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడు అంటూ చంద్రబాబు మోడీని తిట్టారని, ఆ తర్వాత రాహుల్ గాంధీ తో చేతులు కలిపి మోడీని గద్దె దించుతామని చెప్పాడని గుర్తు చేసిన రోజా, ఇప్పుడు మోడీ విజన్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి రాజకీయాలు చేయడం, రంగులు మార్చడం చంద్రబాబు నైజం అంటూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications