సీఎంను టార్గెట్ చేసినట్లు నాకు మెసేజ్: మంత్రి బొజ్జల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడును హత్య చేసేందుకు ఎర్ర చందనం దొంగలు కుట్ర పన్నుతున్నారని, ఇందుకు సంబంధించిన మెసేజ్ తనకు వచ్చిందని మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఈ విషయమై ఆంధ్రజ్యోతి వెబ్ పత్రికలో వచ్చింది. అనంతరం బొజ్జల వ్యాఖ్యలు మరింత వేడి పుట్టించాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబును హత్య చేయడానికి స్మగ్లర్లు కుట్ర పన్నుతున్నారని, దీనిపై సీఐడీకి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశానంటూ అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నుండి అటవీ శాఖ మంత్రి బొజ్జల మొబైల్‌కు బుధవారం సాయంత్రం సంక్షిప్త సందేశం అందిందని చెబుతున్నారు.

మంత్రి మాట్లాడుతూ.. తనకు ఓ హెచ్చరిక సందేశం వచ్చిందని చెప్పారు. చంద్రబాబును లేకుండా చేస్తామని దాని సారాంశమని చెప్పారు. మరోవైపు, డీజీపీ జేవీ రాముడు.. ఈ విషయమై ఇంకా తమకు సమాచారం లేదని చెప్పారు.
కాగా ఎర్రచందనం స్మగ్లర్లు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసినట్లు బుధవారం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ తెలుగు మీడియా సంస్థ ఈ మేరకు ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది. ఇప్పటికే ఆయన హత్యకు అనంతపురం పర్యటనలో రెక్కీ నిర్వహించినట్టు సమాచారమంటూ ఆ మీడియా వ్యాఖ్యానించింది.
ఇటీవల శేషాచలం ఎన్‌కౌంటర్‌తో రగిలిపోతున్న ఎర్ర చందనం స్మగ్లర్లు ప్రతీకారదాడికి వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోందంటూ ఆంధ్రజ్యోతి వెబ్ పత్రిక రాసింది. పక్కా సమాచారం ఉండటంతో ఏపీ ఇంటెలిజన్స్ అధికారులు చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టం చేశారని తెలిపింది. జిల్లా టూర్లలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
శేషాచలం, వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్ఆర్సీ
శేషాచలం, వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌ల పైన ఎన్‌హెచ్ఆర్సీ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఎదురుకాల్పుల్లో పాల్గొన్న సిబ్బంది వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఎన్‌హెచ్ఆర్సీ బృందం త్వరలో సంఘటన స్థలాలను పరిశీలించనుంది.












Click it and Unblock the Notifications