కార్పొరేటర్ గా గెలవలేవు; సీఎం జగన్ మీద వ్యాఖ్యలా .. లోకేష్ కు మంత్రి వెల్లంపల్లి కౌంటర్
వైసిపి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏపీ మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్ గా కూడా గెలవలేని లోకేష్ సీఎం జగన్ మీద ట్వీట్ చేయడం చాలా అసహ్యంగా ఉందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. లోకేష్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు గాని, విలువలు గాని లేవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవాలయాల భూములను దోచుకునే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్న మంత్రి, దేవాలయాల అభివృద్ధి, దేవాదాయ ఆస్తులను కాపాడటం కోసం సీఎం జగన్ నేతృత్వంలో ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్యానించారు. మతాలు, దేవాలయాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం లోకేష్ కు తగదని మంత్రి వెల్లంపల్లి హితవు పలికారు. మతం పేరుతో దాడి చెయ్యటం అలవాటుగా మారిందని అసహనం వ్యక్తం చేశారు. శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఇక తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. జగన్ రెడ్డిది దొంగ దైవభక్తి అంటూ ఆరోపించారు. మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఏడుకొండలవాడి సేవ చేసే అవకాశం దొరికితే ఆ స్వామికి అపచారం తలపెట్టే పనులు చెయ్యటం మంచిది కాదంటూ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ని టార్గెట్ చేశారు. అంతేకాదు ఓ బాబాయ్ కి గొడ్డలిపోటు కానుకగా ఇచ్చి బాబాయ్ కోటాలో మిమ్మల్ని కూర్చోబెట్టారు అంటూ ఎద్దేవా చేశారు. స్వామి, అమ్మవార్లకు పదేపదే అపచారాలు తలపెడుతూ మళ్లీ జగన్ రెడ్డిని రక్షించే గోవిందుడు అంటూ టిటిడి చైర్మన్ సతీమణి స్వామివారి వద్ద అపచారపు నామస్మరణ తీరని కళంకం అంటూ ధ్వజమెత్తారు.
జగన్మోహన్ రెడ్డికి నిజంగా దేవుడిపై భక్తి ఉంటే ఎప్పుడూ, ఏ ఆలయానికి భార్య ఎందుకు రాదు అంటూ ప్రశ్నించారు లోకేష్ . వేదపండితులు తలపై అక్షింతలు వేస్తే ఆ అక్షింతలు అసహ్యంగా దులుపుకోవడం, ప్రసాదం వాసన చూడటం స్వామి పై ఎందుకీ దొంగ దైవభక్తి జగన్ రెడ్డి గారు అంటూ నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా మంత్రి వెల్లంపల్లి కార్పొరేటర్ గా పోటీ చేసినా లోకేష్ గెలవలేడు అంటూ, జగన్ ను విమర్శించే నైతిక హక్కు లోకేష్ కు లేదంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications