చంద్రబాబు.. దమ్ముంటే ఆ లెక్కలు చెప్పు.. మంత్రి విడదల రజిని సవాల్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెట్టుబడులపై దుష్టచతుష్టయం విష ప్రచారం ప్రారంభించిందని మండిపడిన విడదల రజిని అమరరాజా బ్యాటరీస్ పై దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు. చంద్రబాబు హయాంలోనే యువత నిర్వీర్యం అయిందని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో వైద్యశాఖను పట్టించుకోలేదని విమర్శించిన విడదల రజిని, ఆయన హయాంలో ఏ ఆసుపత్రికి నిధులు ఇవ్వలేదని, ఎటువంటి నియామకాలు చేపట్టలేదని విమర్శలు గుప్పించారు.

చంద్రబాబుపై విడదల రజిని ఆగ్రహం .. మీది విషప్రచారం అంటూ ఫైర్
చంద్రబాబుకు దమ్ముంటే తన పాలనలో ఎన్ని నియామకాలు చేపట్టారో, కొత్తగా ఎన్ని ఆసుపత్రులు, వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారో లెక్క చెప్పాలని సవాల్ విసిరారు. తన హయాంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించని చంద్రబాబు, ఇప్పుడు జగన్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో వైద్య ఆరోగ్య శాఖలో 46 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్న విడదల రజిని, నాలుగు లక్షల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కల్పించాం అంటూ పేర్కొన్నారు.

పరిశ్రమలపై చంద్రబాబు నీచ రాజకీయాలపై మండిపడిన మంత్రి
చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విడదల రజిని అసహనం వ్యక్తం చేశారు. అమర రాజా సంస్థ విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వెళితే, దాన్ని కూడా రాజకీయం చేస్తున్న నీఛ సంస్కృతి చంద్రబాబుకి ఉందని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైజాగ్ లో పారిశ్రామిక ప్రగతి గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. సీఎం దావోస్ పర్యటన తర్వాత విశాఖకు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయని విడదల రజిని పేర్కొన్నారు. అదాని గ్రూప్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెడుతున్న చంద్రబాబుకు ఎందుకు కనిపించలేదు చెప్పాలని విడదల రజిని ప్రశ్నించారు.

చంద్రబాబు బీసీల ద్రోహి.. టార్గెట్ చేసిన విడదల రజిని
ఇక చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విడదల రజిని నిప్పులు చెరిగారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని మండిపడిన విడదల రజిని చంద్రబాబు బీసీలను వెనుకబడిన కులాలగానే చూశారని, వారి ఎదుగుదలకు ఎటువంటి ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి అవకాశాలు ఇవ్వని చంద్రబాబును బీసీలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని విడదల రజిని తేల్చిచెప్పారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బీసీలకు రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చారని, మంత్రి పదవుల లోనూ, నామినేటెడ్ పోస్టులలోనూ బీసీలకు సముచిత స్థానం ఇచ్చారని విడదల రజిని తేల్చిచెప్పారు. బీసీల గుండెల్లో జగనన్న చెరగని ముద్ర వేసుకున్నారని విడదల రజిని కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications