లిఫ్ట్‌లో చిక్కుకున్న మంత్రులు: డప్పు కొట్టిన మంత్రులు
ఏలూరు/ విజయవాడ: ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఇద్దరు మంత్రులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉత్కంఠ రేపింది. సుమారు 10 నిమిషాలపాటు వారంతా లిఫ్ట్‌లో ఇబ్బంది పడ్డారు. ఏలూరులో ఆదివారంనాడు ఆంధ్రా ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు కామినేని శ్రీనివాస్, పీతల సుజాత, విప్ చింతమనేని ప్రభాకర్, జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు తదితరులు హాజరయ్యారు.
వీరిని లిఫ్ట్ మొదటి అంతస్తు నుంచి మూడవ అంతస్తుకు తీసుకువెళుతుండగా సాంకేతిక లోపంతో లిఫ్ట్ ఆగిపోయింది. రెండు అంతస్తుల మధ్యలో లిఫ్ట్ ఆగిపోవడంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేసిన తర్వాత లిఫ్ట్ తెరచుకోవడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు.

ఇదిలావుంటే, జాషువా విగ్రహావిష్కరణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు రావెల, దేవినేని ఉమా మహేశ్వర రావు, కొల్లు రవీంద్ర డప్పు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రముఖ దళిత కవి జాషువా విగ్రహాన్ని ఆవిష్కరించారు.
భావితరాలకు జాషువా స్ఫూర్తి ప్రదాత అని చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గుర్రం జాషువా కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. జాషువా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
జాషువా రాసిన గబ్బిలం మర్చిపోలేని పుస్తకమని అంటూ సామాజిక సమస్యలపై కవులు గళం విప్పాలని కోరారు. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు తాము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు.












Click it and Unblock the Notifications