బస్సు దగ్ధం, బంతిగా భావించి బాంబు పట్టుకున్న బాలుడు: విశాఖలో తోటకు తప్పిన ప్రమాదం
విశాఖ/కడప: విశాఖలోని పాతగాజువాక జంక్షన్‌లో ఆదివారం రాత్రి ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే, లగేజీతో పాటు విలువైన వస్తువులు బూడిదయ్యాయి. సీతమ్మధార నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు పాతగాజువాక జంక్షన్ చేరుకునే సమాయానికి ఇంజిన్ నుంచి పొగలు రావడంతో ప్రయాణీకులు దిగిపోయారు.
ఎంపీ తోట నరసింహంకు త్రుటిలో తప్పిన ప్రమాదం
విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో చినదొడ్డిగల్లు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కాకినాడ పార్లమెంట్ సభ్యులు, లోకసభ టిడిపి పార్లమెంటరీ నేత తోట నరసింహానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి కాకినాడ నుంచి ఇన్నోవా వాహనంలో విశాఖపట్నం వెళ్తుండగా చినదొడ్డిగల్లు వద్దకు వచ్చేసరికి వాహనం టైరు పేలిపోవడంతో కారు అదుపు తప్పింది.

వేగంగా వెళ్లి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొంది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో వాహనం బోల్తా పడకుండా డివైడర్‌పై నిలిచిపోయింది. ఆ సమయంలో కారులో తోట నరసింహంతోపాటు మరో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాద అనంతరం ఎంపీ మరో వాహనాన్ని రప్పించి దానిలో విశాఖపట్నం వెళ్లిపోయారు.
బంతి అనుకుని బాంబును పట్టుకున్న బాలుడు!
బంతి అనుకుని బాంబును పట్టుకోవడంతో బాలుడి చెయ్యి తెగిపడిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. మైదుకూరు మండలంలోని ఆదిరెడ్డి పల్లెలో జరిగింది. ప్రసాద్ అనే బాలుడు అక్కడ ఉన్న ఒక బాంబును బంతిగా భావించి చేతిలోకి తీసుకున్న సందర్భంలో అది పేలింది. దీంతో బాలుడి చెయ్యి తెగిపడింది. వెంటనే స్పందించిన స్థానికులు బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించారు.
కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు
బెజవాడలో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఓ బాలుడు శవమై తేలాడు. 14న ఆరేళ్ల సాయి ధర్మతేజ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కుమారుడి కోసం అతడి తల్లిదండ్రులు వెతికారు. అయినా ఫలితం లేకపోయింది.
16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా కెఎల్ రావు నగర్లో అవుట్ పాల్ కాల్వలో ఆరేళ్ల వయసున్న బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆ మృతదేహం ధర్మతేజదిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications