అయ్యే పనేనా?.. ఢిల్లీకి సెగ పుట్టించాలంటే ఇది సరిపోతుందా?: పవన్‌పై విమర్శలు
Recommended Video

అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న తీరు ఆయన అభిమానుల్లోనూ అసంతృప్తిని రాజేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు అని విమర్శించిన నాడే.. ఆయన ప్రత్యక్ష పోరాటం మొదలుపెట్టాల్సి ఉంది. అయినా సరే తన పోరాటమంతా ట్విట్టర్‌కే పరిమితం చేసేశారు జనసేనాని. హొదాపై విశాఖ బీచ్ లో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి సైతం అప్పట్లో ఆయన హాజరుకాలేదు. అడపాదడపా సమావేశాలు పెట్టి టీడీపీ ఎంపీలను విమర్శిస్తూ వచ్చారే తప్పితే.. హోదా కోసం తనవంతుగా చేసిన ప్రత్యక్ష పోరాటం ఏది లేదనే చెప్పాలి.

ఉసూరుమనిపించారు?:
ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే క్రియాశీలకంగా అడుగులు వేస్తున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడైనా గట్టి కార్యాచరణతోనే రంగంలోకి దిగుతారని అంతా భావించారు. కానీ బుధవారం నాడు ఆయన ప్రెస్ మీట్ చూశాక చాలామంది ఉసూరుమన్నారు అన్న వాదన వినిపిస్తోంది. వామపక్షాలతో కలిసి 'మార్నింగ్ వాక్ ఉద్యమం' అంటూ ఆయన చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మార్నింగ్ 'వాక్'పై భిన్నాభిప్రాయాలు
జాతీయ రహదారుల మీద ధర్నాలంటే దద్దరిల్లిపోయేలా ఉండాలి కానీ.. ఏదో చేశామా? కానిచ్చామా? అన్నట్టుగా చేస్తే దానివల్ల ఉపయోగమేంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్‌కు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా.. కనీసం ఎంతదూరం నడుస్తారో కూడా చెప్పకుండా.. ఎలాంటి కార్యక్రమాన్ని రూపొందించారని ప్రశ్నిస్తున్నారు.

ఏదో చేశాంలే అనుకుంటే..:
హోదా ఏపీ ప్రజల సెంటిమెంటుగా మారిన ప్రస్తుత తరుణంలో.. దానికి సంబంధించిన ఏ కార్యాచరణ అయినా ఢిల్లీని తాకే స్థాయిలో దాని సెగ ఉండాలి. అంతే తప్ప.. ఏదో చేసేశాంలే అన్నట్టుగా వ్యవహరిస్తే మరో 'ఫ్లాప్ షో'ను మూటగట్టుకోవడమే తప్ప మరొకటి కాదనేది పరిశీలకుల అభిప్రాయం. పవన్ చేపట్టబోతున్న ఈ 'మార్నింగ్ వాక్'ల ద్వారా ప్రత్యేక హోదా ఆకాంక్ష ఎంతవరకు నెరవేరుతుంది? అన్న ఆయనకే తెలియాలంటున్నారు.

అయ్యే పనేనా?
ఇకపోతే హోదా కోసం ఆమరణదీక్షకైనా సిద్దమన్న పవన్ కల్యాణ్.. దాని గురించి మాత్రం సమాధానం దాటవేయడం కూడా కొంతమందికి నచ్చలేదు. ఆమరణదీక్ష కాకపోయినా ఆ స్థాయిలో పవన్ మరేదైనా ప్లాన్ చేసి ఉండాల్సింది అంటున్నారు. నడక ఉద్యమాలతో ఢిల్లీ రాజకీయాలను కదలించడం అయ్యే పనేనా? అనేది వారి ఆవేదన.












Click it and Unblock the Notifications