నువ్వేం చేశావ్: చిరంజీవిపై అనిత ఫైర్, ఇదీ ముద్రగడ ఆరోగ్య పరిస్థితి..
విజయవాడ/రాజమహేంద్రవరం: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఎంపీ చిరంజీవి పదేళ్లుగా కాపులకు ఏం చేశారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంగళవారం నాడు నిలదీశారు. రైలు తగులబెట్టిన ఫ్యాక్షనిస్టులకు చిరంజీవి వంత పాడుతున్నారని ధ్వజమెత్తారు.
ముద్రగడతో చర్చకు సిద్ధం: గంటా
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాస రావు వేరుగా చెప్పారు. కాపుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముద్రగడ ఆరోగ్యం పైన ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని చెప్పారు.

తుని ఘటనలో నిందితులను విడిచి పెట్టాలని చెప్పడం సరికాదన్నారు. నాలుగు నెలలుగా విచారించి, పూర్తి ఆధారాలతో నిందితులను పట్టుకున్నామని చెప్పారు. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయవద్దని హితవు పలికారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ముద్రగడకు వైద్యం అందించాలని నివేదిక
ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులు మంగళవారం బుల్లెటిన్ విడుదల చేశారు. ముద్రగడ బీపీ 130/90గా ఉందని వైద్యులు తెలిపారు. ముద్రగడ రక్త నమూనా సేకరించి వైద్యం అందించాలన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని డాక్టర్ రమేష్ చెప్పారు.
ముద్రగడ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, ఆయన వైద్యానికి అంగీకరించడం లేదని డాక్టర్లు తెలిపారు. ముద్రగడ భార్య, కోడలికి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్టు తెలిపారు. వైద్య పరీక్షలకు ముద్రగడ మాత్రం ససేమిరా అంటున్నారన్నారు. ఆయనకు అత్యవసర పరీక్షలు, వెంటనే చికిత్స మొదలు పెట్టాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications