క్విడ్ ప్రోకోపై పక్కా ఆధారాలు- మున్ముందు ఇంకా: శ్రీకాంత్ రెడ్డి
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కేసులో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్ని ఆధారాలతో దొరికేశారని వైఎస్ఆర్సీపీకి చెందిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాను నిప్పును అని చెప్పుకుంటూ బిల్డప్ ఇవ్వడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు.
ఈ సాయంత్రం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. క్విడ్ ప్రోకో కింద రాష్ట్ర నిధులను దోచేసి, ఖజానాకు చిల్లు పెట్టిన చంద్రబాబు ఇప్పటికీ తాను నిప్పునని చెప్పుకోవడం హాస్యాస్పదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు తన హయాంలో చేసిన స్కాములు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయని, మరిన్ని శిక్షలకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు.

స్కిల్ స్కామ్‌పై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగిందని, టీడీపీ సభ్యులు ఎందుకు పారిపోయారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు ధైర్యంగా చర్చలో పాల్గొనాలని చెప్పారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనను ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారని, చంద్రబాబు అరెస్టు తర్వాత ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తించిందని మండిపడ్డారు.
అసెంబ్లీలో స్పీకర్‌పై దాడి చేయటం, విజిల్స్ వేయటం, తొడ కొట్టటం వంటి అరాచకాలకు టీడీపీ సభ్యులు పాల్పడ్డారని, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అడ్డుకోవటానికే ఇదంతా చేశారని గడికోట విమర్శించారు. బీఏసీలో కూడా పాల్గొనకుండా వారు పరారయ్యారని ఎద్దేవా చేశారు శ్రీకాంత్ రెడ్డి.
రెండో రోజు కూడా సభలో నందమూరి బాలకృష్ణతో సహా టీడీపీ సభ్యులంతా అడ్డగోలుగా వ్యవహరించారని, వారు ఇచ్చిన వాయిదా తీర్మానం మీదనే చర్చిద్దామన్నా కూడా ముందుకు రావడానికి ధైర్యం చేయలేదని పేర్కొన్నారు. విజిల్స్ వేసిన ముగ్గురినే సస్పెండ్ చేస్తే మిగతావారు కూడా ఎందుకు సభ నుండి పారిపోయారో ప్రజలకు చెప్పాలని అన్నారు.
దేవాలయం వంటి అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై వారికి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలని గడికోట హితవు పలికారు. షెల్ కంపెనీలకు డబ్బు ఎలా మళ్లించారో వాస్తవాలు ప్రజలకు తెలిశాయని, చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని చెప్పారు. కోట్ల కొద్దీ డబ్బు వెదజల్లి పెద్ద పెద్ద లాయర్లను తెచ్చినా కోర్టు వాస్తవాలనే గ్రహించి రిమాండ్ వేసిందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications