'దగ్గుబాటి తప్పుకుంటే ఊర్కోను, ఉపయోగించుకోలేదు'

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు తమ పరిణితిని పెంచుకునే ప్రయత్నాలు చేయడం లేదన్నారు. కాలానుగుణంగా చట్టాల్లోనూ మార్పులు రావాల్సి ఉందని కిరణ్ అన్నారు. చట్టసభల్లో చట్టాలు తప్ప అన్నీ జరుగుతున్నాయన్నారు. చట్టాలపై చర్చించాల్సిన ఎమ్మెల్యేల స్థాయి వార్డు సభ్యుడి స్థాయికి దిగజారిపోయిందని, డ్రైనేజీ నుంచి నీళ్ల సమస్య దాకా ప్రజలు వాళ్లనే అడుగుతున్నారని, ఈ విధానం మారాలని అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో సమాజం కోసం, ప్రజల కోసం దగ్గుబాటిలా ఆలోచించే వారు రాజకీయాల్లో చాలా తక్కువమంది కనిపిస్తారని కిరణ్ ప్రశంసించారు. ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే తాను ఊరుకోనని, కాంగ్రెస్ పార్టీ దగ్గుబాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయిందన్నారు. ఈ కాలంలో ఆయన నాలుగు పుస్తకాలు రాసి ప్రజలకు సేవ చేశారని, ఆయన ఇంకో నాలుగు పుస్తకాలు రాసే పరిస్థితి రానివ్వకూడదని సరదాగా వ్యాఖ్యానించారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యమంత్రి డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ కార్యక్రమంలో పాల్గొనటానికి ప్రాధాన్యం ఇవ్వకుండా, అదే సమయానికి కొంచెం అటూ ఇటుగా మరొక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పరిణామం పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు, రకరకాల ఊహాగానాలకు కారణమైంది.
శనివారం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం. ఈ సందర్భంగా గాంధీ భవన్‌లో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిసిసిప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా పాల్గొనాల్సి ఉంది. ఆయన రాలేదు. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి తాను రచించిన 'ప్రపంచ దేశాలు-పాలనా వ్యవస్థలు' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications