అన్నిచోట్లా MLC మనుషులు.. ప్రాణాలకు ముప్పు?
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అతన్ని ఉభయ గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించకుండా నిరోధించాలన్న సుబ్రమణ్యం తల్లిదండ్రుల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఎమ్మెల్సీ వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నారు.
అనంతబాబు గతంలో కూడా తమను బెదిరింపులకు గురిచేశాడని, అన్నిచోట్లా అతని మనుషులున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, ఎమ్మెల్సీ అధికార పార్టీకి చెందినవారు కావడంతో పోలీసులు నిస్పక్షపాతంగా కేసు విచారణ చేయరని, మొదట్లో పోలీసులు తమ ఫిర్యాదును అనుమానాస్పద మృతి కిందే నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు నిరసనలు తెలియజేసిన తర్వాతే అనంతబాబును
నిందితుడిగా చేర్చారన్నారు. సుప్రీంకోర్టు అతనికి బెయిలివ్వడం సరికాదని, అతని బెయిల్ ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇటీవల హైకోర్టులో జరిగిన విచారణలో సుబ్రమణ్యం తల్లిదండ్రుల తరఫున జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. హత్య వైసీపీ ఎమ్మెల్సీ భార్య సమక్షంలో జరిగిందని, సీసీటీవీ పుటేజ్ లో వారు కనిపిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు అనంత్ బాబుకు సహకరించే ఉద్దేశంతోనే రౌడీషీట్ విధించిన 14 రోజుల్లో కస్టడీ కోసం పిటిషన్ వేయకుండా గడువు దాటిన తర్వాత వేశారని న్యాయమూర్తికి తెలిపారు. అనంత్ బాబుపై రౌడీషీట్ నమోదైనప్పటికీ అతనికి ఎలాంటి నేరచరిత్ర లేదని దిగువ కోర్టుకు పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. పోలీసులు అనుకూలంగా వ్యవహరించడంవల్లే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోర్టును కోరారు.












Click it and Unblock the Notifications