దంచి కొడుతున్న వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పొంగుతున్న నదులతో భారీ నష్టం జరిగింది.
రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు:పరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వచ్చే మూడు రోజులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు ఉత్తర కోస్తాంద్రా, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన చిరుజల్లులు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది.

మూడు రోజుల పాటు అప్రమత్తం:రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించవచ్చు. ఇక ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురుస్తాయని అంచనా వేసింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం జిల్లాలో అత్యధికంగా నార్నూర్‌లో 126 మి.మీ. వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో దస్తురాబాద్ మండలంలో అత్యధికంగా 54.4 మి.మీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో బోధన్ మండలంలో అత్యధికంగా 44 మి.మీల వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ లో దంచి కొట్టిన వర్షం:రాగల మూడు రోజుల పాటు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు (బుధవారం)భద్రాద్రి కొత్తగూడేం, ములుగు, మంచిర్యాల, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఏన్కూరులో 21.6 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా అశ్వాపురంలో 60.2 మి.మీటర్ల వర్షం కురిసింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నప్పటకీ చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీటి వరద వచ్చి చేరడం లేదు.












Click it and Unblock the Notifications