జగన్‌కు మోడీ తీపి కబురు- 110 టన్నుల గుజరాతీ ఆక్సిజన్- 3 ఐఎస్‌వో ట్యాంకులు
ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కార్ తీపి కబురు చెప్పింది. సీఎం జగన్ విజ్ఞప్తి మేరకు ఏపీకి అదనపు ఆక్సిజన్ కేటాయింపులతో పాటు మూడు అదనపు ట్యాంకులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. అదీ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని జామ్ నగర్ రిలయన్స్ రిఫైనరీ నుంచి ఈ అదనపు ఆక్సిజన్ కేటాయించారు. దీంతో రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా మరింత మెరుగుపడనుంది. రేపు దుర్గాపూర్‌లో మూడు ఆక్సిజన్ ట్యాంకుల్ని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అప్పగించనుంది.

జగన్ సర్కార్‌కు గుడ్ న్యూస్
ఆక్సిజన్ కొరతతో రోగుల ప్రాణాల్ని సైతం పోగొట్టుకునే పరిస్ధితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్నిరోజులుగా ఆక్సిజన్ కోసం పదే పదే విజ్ఞప్తులు చేస్తున్న జగన్ సర్కార్‌కు కాస్త ఊరటనిచ్చేలా కేంద్రం ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రస్తుతం ఇస్తున్న 500 టన్నుల ఆక్సిజన్‌కు తోడుగా మరో 110 టన్నుల ఆక్సిజన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత గణనీయంగా తీరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

రేపు దుర్గాపూర్‌లో మూడు ట్యాంకుల అప్పగింత
ఆక్సిజన్ సరఫరా కోసం ఏపీ నుంచి వచ్చిన విజ్ఞప్తులపై స్పందించిన కేంద్రం.. రేపు మధ్యాహ్నం ఒడిశాలోని దుర్గాపూర్‌లో మూడు ఐఎస్‌వో ఆక్సిజన్ ట్యాంకులను మనకు అప్పగించాలని నిర్ణయించింది. ఒడిశాలోని వివిధ కర్మాగారాల నుంచి ఈ ట్యాంకులను నింపి ఏపీకి నిత్యం పంపుతారు. ఇందులో ఒక్కో ట్యాంకులో 20 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది. ఈ మేరకు ఇవాళ అక్కడ ఆక్సిజన్ ట్యాంకులను నింపే ప్రక్రియ కొనసాగుతోంది. ఎల్లుండికి ఈ ఆక్సిజన్ ట్యాంకులతో కూడిన ప్రత్యేక ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ కృష్ణపట్నం పోర్టుకు చేరుకోనుంది. ఇలా ప్రతీ రోజూ మూడు ట్యాంకుల ఆక్సిజన్ అదనంగా ఏపీకి సరఫరా కానుంది.
రిలయన్స్ రిఫైనరీ నుంచి 110 టన్నులు
ఒడిశాలోని దుర్గాపూర్ నుంచి పంపుతున్న ట్యాంకర్లతో పాటు గుజరాత్‌లోని జామ్ నగర్ రిలయన్స్ రిఫైనరీ నుంచి మరో 110 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను ఏపీకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. జామ్ నగర్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు రేపు గుంటూరు చేరుకోనుంది. దీంతో ఈ అదనపు ఆక్సిజన్‌ను అక్కడి నుంచి వివిధ జిల్లాల్లోని ఆస్పత్రులకు పంపుతారు. ఒడిశా నుంచి వచ్చే ఆక్సిజన్ నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు, గుజరాత్ నుంచి వచ్చే ఆక్సిజన్ కోస్తా జిల్లాల్లో ఆస్పత్రులకు పంపనున్నట్లు తెలుస్తోంది.
ఫలించిన జగన్ లాబీయింగ్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్న పరిస్ధితుల్లో ఏపీకి అదనపు ఆక్సిజన్ కావాలంటూ జగన్ సర్కార్ చేసిన విజ్ఞప్తిని కేంద్రం సానుకూలంగానే స్వీకరించింది. సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖను దృష్టిలో ఉంచుకుని ఒడిశా, గుజరాత్ నుంచి ఏపీకి అదనపు ఆక్సిజన్‌ను ప్రత్యేక రైళ్లలో పంపేందుకు కేంద్రం అంగీకరించింది. రేపు దుర్గాపూర్‌లో ఇచ్చే మూడు ట్యాంకులతో కలుపుకుంటే మొత్తం ఆరు ట్యాంకుల్లో ఏపీకి నిరంతరం ఆక్సిజన్ సరఫరా అవుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఏపీకి ఆక్సిజన్ కష్టాలు దాదాపు తీరినట్లే.












Click it and Unblock the Notifications