"హోదాను పక్కనబెట్టి.. చంద్రబాబుకు లాలిపాప్ ఇచ్చారు మోడీ!"
హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ చేతులెత్తేసిన ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబుకు లాలిపాప్ చేతిలో పెట్టారని ఎద్దేవా చేశారు ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్. మంగళవారం నాడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై పలు విమర్శలు గుప్పించారు.
ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి.. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకోవాలని చెప్పి.. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్రమోడీ లాలీపాప్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుతో ముంపుకు గురయ్యేది గిరిజన గ్రామాలే కాబట్టి.. ఆయా గ్రామాల్లో ప్రజాభియాన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పోలవరం నిర్వాసితులందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలన్నారు.

ఇక తెలంగాణ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు దిగుతోందని ఆరోపించారు. పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం ఉన్నది ప్రజాస్వామ్య రోజులని, భూస్వామ్య జమీందారి రోజులు కాదని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తెరగాలని హితవు పలికారు దిగ్విజయ్.
కేసీఆర్ సర్కార్ లో భారీ అవినీతి చోటు చేసుకుంటుందంటూ ఆరోపించిన ఆయన.. వాటర్ గ్రిడ్ పథకంలో వేలకోట్ల అవినీతి జరుగుతోందన్నారు. అలా వస్తోన్న అవినీతి సొమ్ముతోనే ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతసేపు సొంత కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశమే తప్ప రాష్ట్రాభివృద్ధిని పట్టించుకునే స్థితిలో కేసీఆర్ లేరని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications