లోకసభలో కెసిఆర్ జట్టు పట్టుకుంటా: మోదుగుల ఫైర్
గుంటూరు: శాసనసభలో సీమాంధ్ర శాసనసభ్యులు గాదె వెంకటరెడ్డి, ద్రోణంరాజు శ్రీనివాస్‌ల పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు వ్యవహరించిన తీరు పట్ల తెలుగుదేశం నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. శాసనసభ్యులను తెరాస పార్టీ అడ్డుకొన్న తీరు గర్హనీయమని ఆయన అన్నారు.
శుక్రవారం రాత్రి గుంటూరులో ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శాసనసభలోనే శాసనసభ్యుల చొక్కాలను తెరాస సభ్యులు పట్టుకొంటున్నారంటే రేపటి రోజున రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళకు కడుతోందని ఆయన అన్నారు. తక్షణం ఇద్దరు ఎమ్మెల్యేలకు తెరాస సభ్యులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

క్షమాపణ చెప్పకపోతే తాను లోక్‌సభలో తెరాస అధినేత కె చంద్రశేఖర రావు జుట్టు పట్టుకొంటానని హెచ్చరించారు. భవిష్యత్తులో తెరాస ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పడితే ఆ రాష్ట్రానికి కూడా ఎవరూ రారని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు.
లోక్‌సభకు తెలంగాణ బిల్లు వచ్చే ప్రసక్తే లేదని, ఒకవేళ కేంద్రం బలవంతంగా ప్రవేశపెట్టాలని చూస్తే తగిన రీతిలో ఎదుర్కొంటామని ఆయన చెప్పారు. ఆర్టికల్-3 అనేది నాడు భారతదేశంలో 562 సంస్థానాల విలీనం కోసం చేసిన చట్టమని, దానిని నేడు ప్రజాస్వామ్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌పై ప్రయోగిస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications