ఫలించని లాక్ డౌన్-పెరుగుతున్న కేసులు, మృతులు- జగన్ మోడలే దిక్కవుతుందా ?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మార్చి 24న మొదలైన లాక్ డౌన్ మూడో దశకు పొడిగించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. లక్షల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నా కేసులు పెరుగుతున్నాయే తప్ప వ్యాప్తి ఆగడం లేదు. దీంతో ఈ వైరస్ ను జీవితంలో భాగంగా మార్చుకుని పోరాటం సాగించాలన్న ఏపీ సీఎం జగన్ మోడలే ఇప్పుడు దేశానికి దిక్కవుతుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫలితమివ్వని లాక్ డౌన్- పెరుగుతున్న కేసులు, మృతులు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి భయాలతో మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించిన కేంద్రం, అనంతరం 24 నుంచి ఏకంగా లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకొచ్చింది. అది కాస్తా మరో రెండు పొడిగింపులతో 3.0 కు చేరుకుంది. అయినా కేసుల సంఖ్య, మరణాలు తగ్గాయా అంటే ఎవరి వద్దా సమాధానం వినిపించడం లేదు. దీనికి కారణం భారీ జనసాంద్రత కలిగిన దేశంలో ఒక్కసారిగా విధించిన ఆంక్షలను ఉల్లంఘించి ప్రజలు రోజువారీ కార్యకలాపాల కోసం బయటికి వస్తుండటమే. వైరస్ ప్రభావం తెలియక ఇతరులతో కలిసి సంచరిస్తూ వ్యాప్తి చేస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 42 వేల 533కు చేరుకోగా.. మరణాల సంఖ్య 1373కు చేరింది. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 83 మంది మృతులతో కొత్త రికార్డు నమోదైంది. దీంతో లాక్ డౌన్ ఫలితాలపైనే సందేహాలు మొదలయ్యాయి.

జగన్ ప్రతిపాదిత మోడల్...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో లాక్ డౌన్ విధించినా జనం మాత్రం ఇళ్ల నుంచి బయటికి రావడం ఆపడం లేదు. దీంతో గత నెలలో ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఏపీ సీఎం జగన్... లాక్ డౌన్ పరిమితులను సడలిస్తూ పోవడం ద్వారా ఆర్ధిక వ్యవస్దతో పాటు మిగతా రంగాలను గాడిన పెట్టడమే మంచిదని సలహా ఇచ్చారు. జనాన్ని ఎక్కువ రోజులు కట్టి పడేయడం సాధ్యం కాదని అంశాన్ని పరోక్షంగా ప్రధానికి గుర్తు చేసిన జగన్.. భారీగా పరీక్షల నిర్వహణతో పాటు ప్రజలను వైరస్ తో సహజీవనం చేయక తప్పదన్న సంకేతాలు ఇవ్వడమే మంచిదని అభిప్రాయపడ్డారు.

ఏపీలో సడలింపులకే ప్రాధాన్యం...
దాదాపు నెలన్నర రోజులుగా లాక్ డౌన్ అమలవుతున్నా కేసుల సంఖ్య కానీ మరణాలను కానీ ఆపలేని పరిస్ధితి. భారీగా పరీక్షలు నిర్వహించడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతుందని భావించినా అంతే స్ధాయిలో చికిత్సలు అందించగలుగుతున్నారా ఉంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్దితి. దీంతో వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటూనే, భౌతిక దూరం పాటిస్తూనే లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తేస్తేనే మేలన్నది జగన్ అభిప్రాయం. దీంతో ఇదే మోడల్ ఇప్పుడు ఏపీలో అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంతో పాటు ఇతర కార్యాలయాల్లోనూ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఓవైపు కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూనే మరోవైపు వీలైన చోట్ల సడలింపులు ఇవ్వాలనే యోచనలో ఏపీ సర్కారు ఉంది.

ఓవైపు ఇంటింటి పరీక్షలు - మరోవైపు సడలింపులు...
ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న రెడ్ జోన్ జిల్లాల్లో ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం మరోవైపు సడలింపులకు అవకాశం ఉన్న నిర్ణయాలు తీసుకునేలా అధికారులకు స్వేచ్చ ఇస్తోంది. దీంతో క్రమంగా పరిస్దితిలో మార్పు వస్తుందని భావిస్తున్నారు. రాబోయే రెండు వారాల్లో ఆరెంజ్ జోన్ లో ఉన్న పలు ప్రాంతాలు గ్రీన్ జోన్ లోకి వస్తాయని, అలాగే రెడ్ జోన్ లో ఉన్న పలు ప్రాంతాలు ఆరెంజ్ జోన్లోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే క్రమంలో సడలింపులను పెంచాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇదే మోడల్ అనుసరణీయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications